Tuesday 6 November 2012



          ఏపీపై యూపీఏ వివక్ష 

   ఏపీ ఎంపీల సంఖ్యాబలంతో మనుగడ సాగిస్తున్న యూపీఏ సర్కార్... ఆర్థిక సాయం విషయంలో మన స్టేట్ పై వివక్ష చూపుతోంది. ప్రకృతి విపత్తు వచ్చిన ప్రతిసారి  ఆంధ్రప్రదేశ్ కు కంటితుడుపు సాయమందించి చేతులు దులుపుకుంటోంది.  రాష్ట్రం ప్రభుత్వ వినతులను  పట్టించుకోకుండా పక్కనపెడుతోంది. రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వచ్చిన ప్రతిసారి కేంద్రం ప్రకటనలకు ... విడుదల చేసిన నిధులకు పొంతన లేకుండా ఉంది. ఆర్థిక సాయంలో ఏపీపై యూపీఏ సర్కార్ వివక్ష ప్రదర్శిస్తోంది. 33 మంది ఎంపీలను అందించి.. రెండుసార్లు సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైన  రాష్ట్రంపై  కనీస కృతజ్ఞత చూపించడం లేదు కేంద్రం.
     2007లో వరదలు వచ్చినప్పుడు రాష్రంలో  1539 కోట్ల నష్టం ఏర్పడింది. కేంద్రాన్ని 396 కోట్ల సాయం అందించమని కోరితే ... పైసా విదిల్చలేదు. అదే ఏడాది మళ్లీవచ్చిన భారీ వర్షాలకు 1308 కోట్ల పంట నష్టం జరిగింది. 572 కోట్ల సాయం చేయమని సెంట్రల్ ని కోరితే స్పందించలేదు. 2008 మార్చి, ఏప్రిల్ లో జల్ తుఫాను ఎఫెక్ట్ తో  1300 కోట్ల నష్టం ఏర్పడింది. కేంద్రాన్ని 485 కోట్ల సాయం కోరితే ... ముష్టిగా 29 కోట్లు ఇచ్చింది.  2009లో కర్నూలు ను వరదలు ముంచెత్తాయి. జలప్రళయం ధాటికి అనేక జిల్లాలు అల్లాడిపోయాయి.  9 వేల కోట్ల పంటనష్టం జరిగింది. వెయ్యి కోట్ల సాయమందిస్తామని ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. కానీ, అందింది 685 కోట్లే . 2010లో లైలా తుఫాను దెబ్బకు భారీగా పంటలు దెబ్బతిన్నాయి. 1600 కోట్ల నష్టం ఏర్పడింది. కేంద్రాన్ని 1356 కోట్ల సాయం అభ్యర్థిస్తే ... కేవలం 74 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. అదే ఏడాది జూన్ లో కురిసిన వర్షాలకు 5 వేల 650 కోట్ల నష్టం జరిగింది. అయితే సెంట్రల్ నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు.  తాజాగా నీలం తుఫాను కోస్తాను అతలాకుతలం చేసింది.రాష్ట్రంలోని ఆరు జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది... వందల కోట్లలో నష్టం  ఉంటుందని అధికారుల ప్రాధమిక అంచనా వేశారు. పంట నష్టం ఎంతైనా  సెంట్రల్ సాయం రెండు అంకెలకు మించకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ఆర్థిక సాయం కోసం ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలంటున్నారు జనం. విపక్షాలు కూడా   ఇందుకోసం ఉద్యమించాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment