Thursday 1 November 2012

                             ఎర్రన్నాయుడుదుర్మరణం


  టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు(55) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి సమీపంలో గురువారం అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన శ్రీకాకుళంలోని కిమ్స్ సాయిశేషాద్రి ఆస్పత్రికి తరలించారు. అరగంట పాటు వెంటిలేటర్ ఉన్న ఆయన చివరకు ప్రాణాలు విడిచారు.

ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై శ్రీకాకుళంకు తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న కారు మలుపుతిరుగుతున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఎర్రన్నాయుడు మరణవార్త తెలుసుకుని ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎర్రన్నాయుడు హఠాన్మరణం పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు.

కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో ఎర్రన్నాయుడు జన్మించారు. కళావతమ్మ, దాలినాయుడు ఆయన తల్లిదండ్రులు. ఏడుగురు సంతానంలో ఆయన మొదటివారు. గారలో ఉన్నతవిద్య, టెక్కలీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసించారు. విశాఖ వీఎస్ కృష్ణా కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆంధ్రా యూనివ ర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1982, మే 28న విజయకుమారిని వివాహమాడారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.


న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన కేంద్ర మంత్రిగా ఎదిగారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హరిశ్చంద్రపురం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభ్యుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 1983 నుంచి 1994 వరకు ప్యానల్ ఆఫ్ చైర్మన్ మెంబర్‌గా ఉన్నారు. 1995-96 మధ్య కాలంలో చీఫ్ విప్‌గా సేవలందించారు.


1996, 98, 99, 2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్లమెంటరీ నేతగానూ పనిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా సేవలందించారు. 1999-2000లో రైల్వే కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ సంప్రతింపుల కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.

No comments:

Post a Comment