Sunday 30 December 2012


సీఎం కిరణ్ పబ్లిసిటీ  
 

సీఎం కిరణ్ ను  ఇంకా పదవి పోతుందేమోనన్న భయం వెంటాడుతోంది. కుర్చీని కాపాడుకునేందుకు పబ్లిసిటీని నమ్ముకున్నారు నల్లారి. సెల్ఫ్  డబ్బా కొట్టుకోవడంలో  మాజీ సీఎంలను మించిపోయారు.నేషనల్ మీడియాలో రోజూ  ఏపీ అభివృద్ధి పథకాలపై అడ్వర్టైజ్ మెంట్లతో  ఊదరగొడుతున్నారు.అధిష్ఠానం పెద్దల మెప్పుపొందెందుకు నానా పాట్లు పడుతున్నారు. తాను పనిచేస్తున్నట్లు ఢిల్లీ పెద్దలను నమ్మించేందుకు తెగ ఆరాపడుతున్నారు. తన మీడియా వ్యవహారాలు చూసుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించుకున్నారు. ఇందిరమ్మబాట ప్రచారం కోసం ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చిమరీ నేషనల్ మీడియాను రప్పించారు సీఎం.
 ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా తన బొమ్మ కనబడేలా  చేసిన  కిరణ్ ... ఢిల్లీ స్థాయిలోనూ  పబ్లిసిటీకి ప్లానేశారు. సోనియా, రాహుల్ తో పాటు కేంద్రమంత్రులు ఆజాద్ ,వయలార్ రవి, అహ్మద్ పటేల్ , ఏకే ఆంటోనీల ఇళ్లకు వెళ్లే ఇంగ్లీష్ పేపర్లతో ప్రతిరోజూ యాడ్స్ ఇస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ ,ఏషియన్ ఏజ్ ,హిందూ బిజినెస్ లైన్ పేపర్లలో ప్రకటనలకు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. తెలుగు చానెల్స్ , పేపర్లకు ఆఫ్ మినిట్ , ఆర పేజీ యాడ్ ఇవ్వడానికి నానా యాగీ చేసే ఐ అండ్ పీఆర్ ... సీఎం నేషనల్ పబ్లిసిటీకి ఇప్పటివరకు  8 కోట్లు ఖర్చుపెట్టింది. సంక్షేమ పథాకాలు జనానికి అందుతున్నాయో లేదో తెల్సుకునే తీరక లేని కిరణ్ ... సొంత ప్రచారం కోసం ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం దారుణమని మండిపడుతున్నాయి విపక్షాలు. 
ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియాలంటే రాష్ట్రంలో  ప్రచారం  చేయాలి .... డిల్లీలో  ప్రకటనలిస్తే ఏం ఉయోగమని ప్రతిపక్షాలు  ప్రశ్నిస్తున్నాయి. హైకమాండ్  దృష్టిలో పడేందుకు సీఎం కోట్లు ఖర్చుచేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Friday 14 December 2012


                 యుగాంతం పుకారేనా?
      డిసెంబర్ 21 ప్రళయం రాబోతుందా? యుగాంతానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందా? సౌరజ్వాలలు భూమిని సర్వనాశనం చేస్తాయా? ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా అందరిని వెంటాడుతున్న భయం. డిసెంబర్ 21న కచ్చితంగా భూమి బద్దలైపోతుందని కొందరు... సూర్యుడి ప్రతాపంతో మాడి మసైపోతుందని మరికొందరు... ఇలా ఎవరి విశ్లేషణలు వారు చేశారు. మరి ఇందులో ఏది నిజం? నిజంగానే డిసెంబర్ 21న భూమికి నూకలు చెల్లనున్నాయా?
భూమ్మీద  ఏ జీవరాశులు కూడా శాశ్వతం కాదు.అలాగే ఈ సృష్టి కూడా ఏదో ఒకరోజు నాశనం కాక తప్పదు అని పురాణ గ్రంథాలు, పూర్వీకులు చెబుతున్నారు.యుగాంతంపై  అనేక సినిమాలు వచ్చాయి. కాలజ్ఞానుల వాదన ప్రకారం డిసెంబర్ 21, 2012తో సృష్టి అంతరించబోతోందట. ప్రముఖ భవిష్యత్ దార్శనికుడు నోష్ట్రడామస్ ఇది నిజమంటున్నారు.మాయన్స్ క్యాలెండరు కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.డిసెంబర్ 21, 2012 డూమ్స్ డే ...  యుగాంతంగా ప్రచారమైంది.

రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయట.గ్రహాల ఆకర్షణ, వికర్షణల ఫలితంగా భూగోళం అల్లకల్లోలంగా మారుతుందట.భూమిపై ఏ  ప్రాణీ బ్రతికే అవకాశం ఉండదట.ఇదేరోజూ "పోలార్ షిప్మెంట్" అంటే  ధ్రువాల మార్పిడి కూడా జరుగుతుందన్నది కొందరి వాదన.ఫలితంగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం గాను, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం గాను మారనున్నాయి. దీనితో పరిశోధకులు ఏకీభవించడం లేదు.

యుగాంతం రావడానికి చాలా కారణాలు చెబుతున్నారు.దక్షిణ అమెరికాలో నివశించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు అని చెప్పగా..  2012 చివర్లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయని  అంచనా వేస్తున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు.ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై సౌర తుఫానులు ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది.అడుగున అగ్ని పర్వతం ఉండడం వల్లే ఇలా జరుగుతోంది. అగ్నిపర్వతం ప్రతి ఆరున్నర లక్షల ఏళ్లకోసారి బద్ధలవుతుంటుంది.దీని వల్ల సూర్యరశ్మి భూమిపై సోకే అవకాశం లేకుండా ఆకాశమంతా బూడిద కమ్ముకుంటుంది. భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. ఇది  2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బైబిల్ తో పాటు ఇతర మత గ్రంథాలు యుగంతాన్ని ప్రస్తావించాయి. పోతులూరి వీరిబ్రహ్మం కూడా  తన కాలజ్ఞానంలో యుగాంతాన్ని వివరించారు.
సుమేరియన్లు గుర్తించిన నిబురు గ్రహం భూమి వైపు దూసుకొస్తోందని తెలిసినప్పటి నుంచీ ప్రళయవార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది భూమిని సమీపిస్తే ఖగోళంలో అనేక మార్పులు సంభవిస్తాయని, గ్రహాల కక్ష్యల్లో మార్పులు చోటు చేసుకొని ఘోర పరిణామాలకు దారితీస్తుందని పుకార్లు షికార్లు చేశాయి.ఆ ప్రళయ కాల దినం 2003 మేలో వస్తుందని ముందుగా అంచనా వేశారు. అది కాస్తా దాటిపోయింది. తర్వాత మాయన్ క్యాలెండర్‌కు 2012కు లింక్ చేస్తూ ప్రళయాన్ని పోస్ట్‌పోన్ చేశారు. మాయన్ క్యాలెండర్‌ డిసెంబర్‌లో ముగుస్తుందనే మెసో-అమెరికన్ల సంప్రదాయ లెక్కే 2012 డిసెంబర్‌ 21 ప్రళయానికి ఆధారం. అయితే అది కూడా తప్పేనని, మాయన్ క్యాలెండర్‌ డిసెంబర్ 21తో ముగియడం లేదని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.  జనవరి 1 నుంచి కొత్త క్యాలెండర్‌ ప్రారంభమైనట్టే... మాయన్ల లాంగ్‌ కౌంట్ పీరియడ్ మొదలవుతుందని చెబుతున్నారు.
మరోవైపు సౌర కుటుంబంలోకి ఒక అపరిచిత గ్రహం చొచ్చుకొచ్చి... నేరుగా భూమినే ఢీ కొంటుందని, దీంతో భూమి బద్దలైపోతుందన్న ప్రచారం జరుగుతోంది.ఇందులో ఎలాంటి నిజం లేదని నాసా విశ్లేషిస్తోంది.ఇలాంటిదేమైనా ఉంటే.. ఇప్పటికే తెలిసిపోయేదని అంటున్నారు సైంటిస్టులు.ఇక సూర్యుడి నుంచి వెలువడే... జ్వాలలు భూమిని భస్మీపటలం చేస్తాయన్నది మరికొందరి వాదన.సౌరజ్వాలలు... సూర్యుడి ఉపరితలంపై ఎప్పుడూ ఉండేవే. వాటి తీవ్రత పెరిగిన సందర్భాల్లో... ఆ ప్రభావం భూమిపైనా స్వల్పంగా ఉంటుంది. ఉపగ్రహాలు, సమాచార వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. కానీ... ఏ రకంగా చూసినా... ఇప్పుడప్పుడే సౌరజ్వాలలు భూమిని మాడి మసి చేసేంతగా వచ్చే అవకాశమే లేదంటోంది నాసా.గ్రహాలన్నీ నిర్దేశిత కక్ష్యల్లోనే పరిభ్రమిస్తాయని ... 4 బిలియన్ సంవత్సరాల వరకూ... భూగోళం నిక్షేపంలా ఉంటుందంటోంది నాసా. 400 కోట్ల ఏళ్లు అంటే మరో 16 కోట్ల తరాల జనరేషన్‌కి ఇంకా ఈ భూమ్మీద అవకాశముందని చెబుతోంది. భూమి వైపు దూసుకొస్తున్న గ్రహం ప్లూటో లాంటి చిన్న గ్రహమని... అది సౌరవ్యవస్థ బయటి భాగంలో ఉన్నందున మనకొచ్చిన ప్రమాదమేమీ లేదంటోంది.యుగాంతం లేదని నాసా భరోసా ఇస్తున్నా..  జనంలో అపోహలు తొలగడం లేదు.
  

Monday 10 December 2012


      విగ్రహ రాజకీయం

పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహ  ప్రతిష్ట ఆలస్యం కావడానికి కారకులెవరు? అన్నీ అనుమతులొచ్చాక అడ్డుపడిందేవరు? నేతల ప్రెస్టేజ్ వల్లే సమస్య జటిలమైందా? అన్నగారి విగ్రహంపై ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది? చంద్రబాబు,పురందేశ్వరి వాదనల్లో ఏదీ నిజం?
చిన్నమ్మ వర్సెస్  చంద్రబాబు ...కేంద్రమంత్రి పురందేశ్వరి,టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది.ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల ఆధిపత్య పోరు పొలిటికల్ వార్ కి తెరలేపింది.పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లభించడం  తమ ఘనతేనని ఎవరికివాళ్లు చెప్పుకుంటున్నారు. ఇంతకాలం ఆలస్యంకావడానికి ఎదుటివాళ్లే కారణమని ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.టీడీపీ తనపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని పురందేశర్వరి రాసిన బహిరంగ లేఖకు కౌంటర్ గా చద్రబాబు కూడా లెటర్  రాయడం చర్చనీయాంశమైంది.
 నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితతో లెటర్ స్టార్ట్ చేశారు పురందేశ్వరి.లోక్ సభలో తన తండ్రి విగ్రహ ప్రతిష్టకు అడ్డుపడుతున్నానని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. విగ్రహ ఏర్పాటుపై  ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలు తనను అభినందిస్తుంటే... తట్టుకోలేక  తన అనుచరులతో బాబు విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 19, 2000లోనే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అంగీకరిస్తూ  విగ్రహం పంపించాలని  పార్లమెంటరీ విగ్రహ అనుమతి కమిటీ చంద్రబాబుకు లేఖ రాసిందని గుర్తు చేశారు. 2000 నుంచి 2004  మే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు ఎందుకు విగ్రహం ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. 2005 డిసెంబర్ 7 న పార్లమెంటరీ విగ్రహాల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసినా స్పందించలేదని వార్తలు రావడంతో ...అప్పటి లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి తాను లేటర్ రాశానన్నారు. విగ్రహ ఏర్పాటుకు ఎన్టీఆర్ కుమార్తెగా తనకు అవకాశం కల్పించాలని కోరానన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాబు విగ్రహాల ఏర్పాటు కమిటీలో సభ్యుడైన ఎర్రన్నాయుడి చేత హడావిడిగా  లేఖ ఇప్పించారన్నారామె. స్పాట్..
        2009లో మరోసారి  విగ్రహ ఏర్పాటుపై స్పీకర్ మీరాకుమార్ కు లేఖరాశానన్నారు పురందేశ్వరి.దీంతో 2010 మే 7 న తన సంతకం లేకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సిగ్నేచర్స్ తో  విగ్రహం ఇప్పిస్తామని నామా నాగేశ్వరరావు ద్వారా బాబు లేఖ  ఇప్పించారన్నారు.విషయం చెబితే తాను కూడా సంతకం చేసే దాన్నన్నారు. జనం దృష్టిలో తనను దోషిగా చూపట్టెందుకు పథకం ప్రకారం బాబు కుట్ర చేశారని ఆరోపించారు. సెప్టెంబర్ 12 , 2012 న లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి విగ్రహ ప్రతిష్ట అనుమతి పత్రాలు అందాయన్నారు. తన సోదరులను కలిసి విషయం వివరించాకే ... విగ్రహాన్ని తయారు చేయించానన్నారు.వాస్తవాన్ని  పక్కదారి పట్టించేందుకు  రాజకీయ లబ్ధికోసం బాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు చిన్నమ్మ.
పురందేశ్వరీ లేఖలో అన్ని అవాస్తవాలు , వక్రీకరణలే ఉన్నాయంటున్నారు చంద్రబాబు.ఆమె  వ్యక్తిగత పంతం , మొండి పట్టుదల వల్లే మహానాయకుడి విగ్రహ ప్రతిష్టలో తొమ్మిదేళ్లు జాప్యం జరిగిందన్నారు. వస్తున్న మీకోసం యాత్రకు జనం బ్రహ్మరథం పడుతుండడంతో ... కాంగ్రెస్ హైకమాండ్  కుట్రలో భాగంగా తనను అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా  దుష్ప్రచారానికి తెగబడ్డారని ఎదురుదాడి చేశారు చంద్రబాబు. కేంద్రమంత్రి లెటర్ తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందన్నారాయన.
ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్ లో  ఏర్పాటు చేయాలని కోరిందే తమ పార్టీ  అన్నారు బాబు. ఎన్టీఆర్ తో  పాటు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా  పార్లమెంటులో ఏర్పాటు చేయాలని అప్పటి  లోక్ సభ స్పీకర్ జీఎంసీ బలయోగిని కోరామన్నారు. డిసెంబర్ 19, 2000లో నేషనల్ పొట్రైట్ కమిటీ సమావేశం రెండు విగ్రవిగ్రహాల ఏర్పాటకు అనుమతిస్తూ విగ్రహాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.అయితే ఈలోపే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం అందించేందుకు వైఎస్ అంగీకరించలేదన్నారు. జూన్ 24 , 2006న ఎర్రన్నాయుడు లోక్ సభ సెక్రటేరియట్ డిప్యూటీ సెక్రటరీ సురేందర్ సింగ్ కు లేఖరాసినట్లు వివరించారు. 16 ఫిబ్రవరి 2010న మరోసారి లేఖరాశామన్నారు. ఆ వెంటనే పురందేశ్వరీ 20 అనుబంధ పత్రాలు జోడిస్తూ 50 పేజీల లేఖ రాయడం ... ఆమే రాజకీయ దురుద్దేశానికి నిదర్శనమన్నారు. మూడు నెలల కిందటే  విగ్రమ అనుమతి పత్రాలు వచ్చిన ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు బాబు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టపై కుటుంబ సభ్యులతో పాటు సంతకం పెట్టమని కోరితే ముందుకు రాలేదన్నారు బాబు. హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్  తొలగించి  రాజీవ్ గాంధీ పేరు పెట్టినప్పుడు పురందేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్నదానిపై ఎందకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రధాన శత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీలో చేరి ... తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు బాబు.ఇప్పటికైనా రాజకీయం చేయడం మని , విగ్రహ ఏర్పాటుకు సహకించాలన్నారు. మొత్తమ్మీద చంద్రబాబు , పురందేశ్వరి లేఖల యుద్ధం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహానీయుడి విగ్రహం ఏర్పాటు కంటే వ్యక్తిగత ప్రతిష్టకే నేతలు ప్రాధాన్యతనిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.