Monday 10 December 2012


      విగ్రహ రాజకీయం

పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహ  ప్రతిష్ట ఆలస్యం కావడానికి కారకులెవరు? అన్నీ అనుమతులొచ్చాక అడ్డుపడిందేవరు? నేతల ప్రెస్టేజ్ వల్లే సమస్య జటిలమైందా? అన్నగారి విగ్రహంపై ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది? చంద్రబాబు,పురందేశ్వరి వాదనల్లో ఏదీ నిజం?
చిన్నమ్మ వర్సెస్  చంద్రబాబు ...కేంద్రమంత్రి పురందేశ్వరి,టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది.ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల ఆధిపత్య పోరు పొలిటికల్ వార్ కి తెరలేపింది.పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లభించడం  తమ ఘనతేనని ఎవరికివాళ్లు చెప్పుకుంటున్నారు. ఇంతకాలం ఆలస్యంకావడానికి ఎదుటివాళ్లే కారణమని ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.టీడీపీ తనపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని పురందేశర్వరి రాసిన బహిరంగ లేఖకు కౌంటర్ గా చద్రబాబు కూడా లెటర్  రాయడం చర్చనీయాంశమైంది.
 నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితతో లెటర్ స్టార్ట్ చేశారు పురందేశ్వరి.లోక్ సభలో తన తండ్రి విగ్రహ ప్రతిష్టకు అడ్డుపడుతున్నానని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. విగ్రహ ఏర్పాటుపై  ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలు తనను అభినందిస్తుంటే... తట్టుకోలేక  తన అనుచరులతో బాబు విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 19, 2000లోనే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అంగీకరిస్తూ  విగ్రహం పంపించాలని  పార్లమెంటరీ విగ్రహ అనుమతి కమిటీ చంద్రబాబుకు లేఖ రాసిందని గుర్తు చేశారు. 2000 నుంచి 2004  మే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు ఎందుకు విగ్రహం ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. 2005 డిసెంబర్ 7 న పార్లమెంటరీ విగ్రహాల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసినా స్పందించలేదని వార్తలు రావడంతో ...అప్పటి లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి తాను లేటర్ రాశానన్నారు. విగ్రహ ఏర్పాటుకు ఎన్టీఆర్ కుమార్తెగా తనకు అవకాశం కల్పించాలని కోరానన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాబు విగ్రహాల ఏర్పాటు కమిటీలో సభ్యుడైన ఎర్రన్నాయుడి చేత హడావిడిగా  లేఖ ఇప్పించారన్నారామె. స్పాట్..
        2009లో మరోసారి  విగ్రహ ఏర్పాటుపై స్పీకర్ మీరాకుమార్ కు లేఖరాశానన్నారు పురందేశ్వరి.దీంతో 2010 మే 7 న తన సంతకం లేకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సిగ్నేచర్స్ తో  విగ్రహం ఇప్పిస్తామని నామా నాగేశ్వరరావు ద్వారా బాబు లేఖ  ఇప్పించారన్నారు.విషయం చెబితే తాను కూడా సంతకం చేసే దాన్నన్నారు. జనం దృష్టిలో తనను దోషిగా చూపట్టెందుకు పథకం ప్రకారం బాబు కుట్ర చేశారని ఆరోపించారు. సెప్టెంబర్ 12 , 2012 న లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి విగ్రహ ప్రతిష్ట అనుమతి పత్రాలు అందాయన్నారు. తన సోదరులను కలిసి విషయం వివరించాకే ... విగ్రహాన్ని తయారు చేయించానన్నారు.వాస్తవాన్ని  పక్కదారి పట్టించేందుకు  రాజకీయ లబ్ధికోసం బాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు చిన్నమ్మ.
పురందేశ్వరీ లేఖలో అన్ని అవాస్తవాలు , వక్రీకరణలే ఉన్నాయంటున్నారు చంద్రబాబు.ఆమె  వ్యక్తిగత పంతం , మొండి పట్టుదల వల్లే మహానాయకుడి విగ్రహ ప్రతిష్టలో తొమ్మిదేళ్లు జాప్యం జరిగిందన్నారు. వస్తున్న మీకోసం యాత్రకు జనం బ్రహ్మరథం పడుతుండడంతో ... కాంగ్రెస్ హైకమాండ్  కుట్రలో భాగంగా తనను అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా  దుష్ప్రచారానికి తెగబడ్డారని ఎదురుదాడి చేశారు చంద్రబాబు. కేంద్రమంత్రి లెటర్ తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందన్నారాయన.
ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్ లో  ఏర్పాటు చేయాలని కోరిందే తమ పార్టీ  అన్నారు బాబు. ఎన్టీఆర్ తో  పాటు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా  పార్లమెంటులో ఏర్పాటు చేయాలని అప్పటి  లోక్ సభ స్పీకర్ జీఎంసీ బలయోగిని కోరామన్నారు. డిసెంబర్ 19, 2000లో నేషనల్ పొట్రైట్ కమిటీ సమావేశం రెండు విగ్రవిగ్రహాల ఏర్పాటకు అనుమతిస్తూ విగ్రహాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.అయితే ఈలోపే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం అందించేందుకు వైఎస్ అంగీకరించలేదన్నారు. జూన్ 24 , 2006న ఎర్రన్నాయుడు లోక్ సభ సెక్రటేరియట్ డిప్యూటీ సెక్రటరీ సురేందర్ సింగ్ కు లేఖరాసినట్లు వివరించారు. 16 ఫిబ్రవరి 2010న మరోసారి లేఖరాశామన్నారు. ఆ వెంటనే పురందేశ్వరీ 20 అనుబంధ పత్రాలు జోడిస్తూ 50 పేజీల లేఖ రాయడం ... ఆమే రాజకీయ దురుద్దేశానికి నిదర్శనమన్నారు. మూడు నెలల కిందటే  విగ్రమ అనుమతి పత్రాలు వచ్చిన ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు బాబు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టపై కుటుంబ సభ్యులతో పాటు సంతకం పెట్టమని కోరితే ముందుకు రాలేదన్నారు బాబు. హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్  తొలగించి  రాజీవ్ గాంధీ పేరు పెట్టినప్పుడు పురందేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్నదానిపై ఎందకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రధాన శత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీలో చేరి ... తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు బాబు.ఇప్పటికైనా రాజకీయం చేయడం మని , విగ్రహ ఏర్పాటుకు సహకించాలన్నారు. మొత్తమ్మీద చంద్రబాబు , పురందేశ్వరి లేఖల యుద్ధం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహానీయుడి విగ్రహం ఏర్పాటు కంటే వ్యక్తిగత ప్రతిష్టకే నేతలు ప్రాధాన్యతనిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

No comments:

Post a Comment