Monday 1 February 2016

RSS DRESS CODE



                            ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ లో మార్పు

 

         హిందూ మతానికి ప్రతినిధిగా ఉన్న ఆర్ఎస్ఎస్ తన డ్రెస్ కోడ్ ను మార్చుకునేందుకు సిద్ధమైంది. తెల్లచొక్కా, ఖాకీ నిక్కర్, లెదర్ బూట్లు, కాన్వాస్ బెల్టు, నల్లటోపీ, చేతిలో కర్ర..  దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఇది కరసేవకుల డ్రెస్ కోడ్. ఇప్పుడీ కోడ్ లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే మార్చిలో జరగనున్న ప్రతినిధి సభ (ఆర్ఎస్ఎస్ అత్యున్నత స్థాయీ సంఘం) లోనే డ్రస్ కోడ్ మార్పునకు సంబంధించిన నిర్ణయం ఖరారు కానుంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ శాఖల్లోకి యువకులు పెద్ద ఎత్తున చేరుతున్న క్రమంలో వారిని మరింతగా ఆకట్టుకునేలా నిక్కర్ స్థానంలో ట్రౌజర్ ప్రవేశపెట్లాలని ఆ సంస్థ భావిస్తోంది.

'కరసేవకుల డ్రస్ కోడ్ మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే మార్చిలో నాగౌర్ (రాజస్థాన్)లో జరగనున్న ప్రతినిధి సభలో దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది' అని ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం బాధ్యుడు మోహన్ వైద్య తెలిపారు. మార్పులకు అంగీకారం లభిస్తే ఈ ఏడాది విజయదశమి నుంచే కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి తెస్తామని వైద్య పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంస్థ సీనియర్ నాయకులు ఇప్పటికే మూడు డిజైన్లకు ఓకే చెప్పారు. తెలుపు చొక్కాకు కాంబినేషన్ గా బ్లూ, గ్రే లేదా బ్రౌన్ కలర్ ట్రౌజర్ ను కొత్త డ్రెస్ కోడ్ గా ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఫ్యాషన్ డిజైనర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

సంస్థాగతమైన మార్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించే ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ మారిస్తే అది సంచలనాత్మకమే అవుతుంది. ఎందుకంటే గడిచిన 91 ఏళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే డ్రెస్ కోడ్ లో మార్పులు చేసిందా సంస్థ. ఆవిర్భవించిన 14 ఏళ్ల తర్వాత.. అంటే, 1939లో ఖాకీ చొక్కా స్థానంలో తెలుపు రంగు చొక్కాలను ప్రవేశపెట్టింది. మళ్లీ 1973లోగానీ సేవకులు ధరించే బూట్ల విషయం కొన్ని సడలింపులకు ఓకే చెప్పింది. 2010లో జైన మత గురువు తరుణ్ సాగర్ సూచన మేరకు లెదర్ బెల్ట్ స్థానంలో కాన్వాస్ బెల్టులు ధరించాలనే నిర్ణయమే డ్రెస్ కోడ్ విషయంలో ఆర్ఎస్ఎస్ చివరి మార్పు. అప్పటి నుంచి పలు అభ్యర్థనలు వచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.