Wednesday 28 November 2012


   సీఐడీ ఆఫీసర్ గా అమీర్ ఖాన్ 
అమీర్ ఖాన్ ఏదీ చేసినా సంథింగ్ స్పెషల్ ... సినిమా  కథల ఎంపికలోనే కాదు పాత్రల గెటప్ లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చిత్రం ప్రమోషన్  కూడా తన భుజాలపై వేసుకుంటారు. తాజాగా కొత్త సినిమా ప్రచారం కోసం బుల్లి తెరపై సీఐడీ ఆఫీసర్ అవతారం ఎత్తారు మిస్టర్ ఫర్ ఫెక్టు . సీరియల్స్ ద్వారా సినిమాలు ప్రమోషన్ చేసుకునే హీరోల క్లబ్ లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా చేరారు. త్రీ ఈడియట్స్ తో బాలీవుడ్  సినిమా  ప్రచారంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన అమీర్ ఖాన్ ... తాజా చిత్రం తలాష్  ప్రమోషన్ కోసం సోనీ టీవీలో ప్రసారమయ్యే సీఐడీ సీరియల్ లో  కనిపించారు. స్పెషల్ ఎపిసోడ్ లో  పోలీస్ ఆఫీసర్ గా తనదైన మార్క్ యాక్షన్ తో ఆకుట్టుకున్నారు అమీర్ .
తలాష్ సినిమా కూడా సస్పెన్ష్ థ్రిల్లర్ కావడంతో సీఐడీ చూసే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని అమీర్ భావించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తలాష్ ఈ నెల 30 న విడుదల కానుంది. ఇందులో  అమీర్ కు జతగా బెబోతో పాటు రాణి ముఖర్జి నటించారు. గతంలో తన అల్లుడు ఇమ్రాన్ ఖాన్ నటించిన జానే తూ యా జానే నా సినిమా ప్రచారం కోసం సల్మాన్ ఖాన్ షో దస్ కా ధమ్ లో పాల్గొన్నారు అమీర్ . 

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోలు తమ చిత్రాల ప్రచారం కోసం టీవీ సీరియల్స్ ను  చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు రౌడీ రాథోడ్ చిత్రం ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్ ,సోనాక్షి సిన్హా సీఐడీ సీరియల్ లో కనిపించారు. దబాంగ్ సినిమా ప్రచారంలో భాగంగా సల్మాన్ ఖాన్ ... కలర్స్ చానెల్ ప్రసారమయ్యే తుజే లగాన్ సీరియల్ లో ప్రత్యక్షమయ్యాడు. సీఐడీ సీరియల్ లో సల్మాన్ కూడా గతంలో  గెస్ట్ రోల్ లో నటించాడు.  ఆ సీరియల్ లో వాంటెడ్ , బాడీగార్డ్ చిత్రాలు పైరసీ అయ్యాయని సీఐడీ టీమ్ దర్యాప్తు చేస్తుంటే సల్మాన్  సహకరిస్తాడు.
 బర్ఫీ హీరో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్  హిట్లర్ దీదీ సీరియల్ లో  కనిపించగా... , డర్టీపిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్  కూడా ఓ సీరియల్ లో  సందడి చేశారు. టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను ఆకర్శించేందుకు సినిమా హీరోలు అప్పుడప్పుడు బుల్లి తెరపైన మెరుస్తున్నారు.

Monday 26 November 2012


           జైల్లో ఆరు నెలలు
 
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ అరెస్టై ఆరు నెలలయింది. ఉప ఎన్నికలకు ముందు మే 27  సాయంత్రం ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆస్తుల కేసులో మూడు రోజులు యువనేతను  విచారించిన సీబీఐ ఆ తర్వాత అదుపులోకి తీసుకుంది . సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి సుప్రీం వరకు వెళ్లినా బెయిల్ రాకపోవడంతో .... చంచల్ గూడ జైలుకే పరిమితమయ్యారు జగన్ . వచ్చే ఏడాది మార్చి చివరినాటికి  కేసు విచారణ పూర్తిచేయాలని సీబీఐ ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అప్పటి వరకు బెయిల్  కోరవద్దని జగన్ ను కు సూచించింది. అయితే తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినందునా బెయిల్ ఇవ్వాలని లేటెస్ట్ గా నాంపల్లి సీబీఐ కోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జగన్.... దీనిపై కోర్టు తీర్పు రావాల్సి ఉంది.
జగన్ అరెస్ట్ తో  అందరూ వైసీపీ దుకాణం క్లోజ్ అనుకున్నారు. అయితే కొడుకు లేకున్నా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు విజయమ్మ. ఉప ఎన్నికల్లోనూ  తల్లి, కూతరు ప్రచారం చేసి, 15 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఆ ప్రభావంతో ఇప్పుడు  వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. సీమాంధ్ర తో పాటు తెలంగాణలోనూ  ఇరత పార్టీల నేతలు  వైసీపీలో చేరుతున్నారు. అయితే ఇదంతా జగన్ వ్యూహమేనంటున్నారు ప్రత్యర్థులు. జైలు నుంచే ఆయన చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. పార్టీలో చేరుతున్న నేతలు ముందుగానే జగన్ తో ములాఖత్ అవుతున్నారు. దీంతో చంచల్ గూడ జైలు జగన్ గెస్ట్ హౌస్ గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.
మొత్తమ్మీద ఆరు నెలలుగా జైల్లో ఉంటూ కూడా  పార్టీని కాపాడుకోగలిగారు జగన్ . తల్లి , చెల్లిని  నిత్యం జనంలో ఉండేలా గైడ్ చేస్తూ  ప్రత్యర్థులకు దీటు గా సమస్యలపై ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు.  ఇంతచేసినా ఆయన లేని లోటు పార్టీలో కనిపిస్తుందంటున్నారు వైసీపీ నేతలు .  జగన్ బయట ఉంటే ఇతర పార్టీల నుంచి వలసలు మరింత ఊపందుకునేవని చెబుతున్నారు. ఈసారైనా బెయిల్ వస్తుందేమోనని  ఆశతో ఎదురు చూస్తున్నారు.


కాంగ్రెస్ కు డిసెంబర్ గండం

కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ .... . తెంగాణపై టీ కాంగ్రెస్ ఎంపీల డెడ్ లైన్ అధికార పార్టీ నేతల  గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. డిసెంబర్ 9 తర్వాత అసమ్మతి అగ్ని పర్వతం  బద్దలవుతుందా? వలసల జోరు ఊపందుకుంటుందా?లోపే  పార్టీని రక్షించుకునేందుకు హైమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందా? రాష్ట్ర కాంగ్రెస్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ . డిసెంబర్ 9 ఫియర్ అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్  నేతలను వెంటాడుతోంది. తెలంగాణపై అధిష్టానం నిర్ణయం కోసం ఇంతకాలం ఎదురు చూసిన టీ కాంగ్రెస్  ఎంపీలు .... ఇప్పుడు తమకు తామే డెడ్ లైన్ విధించుకున్నారు. వచ్చే నెల 9 లోపు  కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ... తామే సీరియస్ డెసిషన్ తీసుకుంటామంటున్నారు. టీ ఎంపీల హాట్ హాట్ కామెంట్స్ ... ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల వలసలు  కాంగ్రెస్ పార్టీని   ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తాజాగా  పార్లమెంట్ లాబీలో  పార్టీ అధినేత్రి సోనియాను కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖ సమర్పించారు టీ కాంగ్రెస్ ఎంపీలు . మేడమ్ సానుకూలంగా స్పందించారని నేతలు చెబుతున్నారు. రెండు రోజుల్లో పిలిచి మాట్లాడతానని చెప్పారంటున్నారు. అయితే తెలంగాణపై మూడేళ్లుగా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్న హైకమాండ్  పదిరోజుల్లో నిర్ణయం తీసుకుంటుందా? అన్న అనుమానం నేతలను వేధిస్తోంది. రాష్ట్రవిభజనపై స్పష్టమైన ప్రకటన రాకుంటే కేంద్రం తెలంగాణ  ఇవ్వదని భావించాల్సి ఉంటుందంటున్నారు  టీ కాంగ్రెస్ నేతలు  . తమదారి తాము చూసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు  వైసీపీలోకి జంపయ్యే  పరిస్థితి కనిపిస్తోంది.
డిసెంబర్ 9 గండాన్ని హైకమాండ్ ఎలా  అధిగమిస్తుందన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందునా తెలంగాణపై నిర్ణయానికి ఇదే సరైన టైమ్ అంటున్నారు నేతలు . ఒక వేళ ఎమ్మెల్యేలు , ఎంపీలు  ఇతర పార్టీల్లోకి వలస వెళితే ... ఆ ప్రభావం రాష్ట్ర సర్కార్ తో పాటు  కేంద్రంపైనా ఉందంటున్నారు . చేతులు కాలాక ఆకులు పట్టుకున్నదానికంటే ... ముందే జాగ్రత్త పడడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. 

Thursday 8 November 2012



          ఖద్దర్ నేతలు వర్సెస్ ఖాకీ బాసులు  




    ప్రజాప్రతినిధులమన్న దర్పం ఒకరిది.... చట్టానికి ,న్యాయానికి రక్షకులమన్న ధీమా మరొకరిది. అధికార అహం శాసిస్తుంటే ... ఉద్యోగ ధర్మం ఎదరిస్తోంది. ఖద్దర్ చొక్కాలకూ  ఖాకీయూనిఫాం కూ పొసగడం లేదు . పాలక పార్టీకి సలామ్ చేయని పోలీసుల నైజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నేతలు . పోలిటికల్ లీడర్ల ఒత్తిళ్లను పోలీసు  సీతయ్యలు లెక్క చేయడంలేదు. దీంతో కొన్ని జిల్లాల్లో రెండు వర్గాల మధ్య డైరెక్ట్ వార్ నడుస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వెళ్లింది పరిస్థితి. మాట వినని  పోలీసు అధికారులను ట్రాన్స్ ఫర్ చేయాలని నాయకులు సీఎంపై ఒత్తిడి తెస్తుంటే ... ఎనీ ప్లేస్ .. ఎనీ టైమ్  డ్యూటీ ఎక్కడైనా ఒక్కటే .. దేనికైనా రెడీ అంటున్నారు ఖాకీ బాసులు .
పోలీసు ఉద్యోగమంటే  ఆషామాషీ కాదు. శాంతి భద్రతలతో పాటు రాజకీపరమైన అనేక ఒత్తిళ్లు ఉంటాయి. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. లేదంటే విమర్శలు , ట్రాన్స్ ఫర్లు తప్పవు. ఈ మధ్య పోలీసు వ్యవస్థపై పొలిటికల్ ప్రెజర్స్ ఎక్కువయ్యాయి.  ఖాకీల దిశ , దశను కూడా అధికార నేతలు శాసించే పరిస్థితి ఏర్పడింది. నాయకుల మాటకు ఎస్ అనని  ఎస్పీలపై వివాదాలు ముసురుకుంటున్నాయి.
        తాజాగా మెదక్ జిల్లా సీఎం ఇందిరమ్మ బాటలో స్థానిక ప్రజాప్రతినిధులకు  టార్గెట్ అయ్యారు ఎస్పీ అవినాశ్ మహంతి. ముఖ్యమంత్రి కాన్వాయ్ కు స్వాగత పలికేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం వివాదాస్పదమైంది. సీఎం పర్యటనకు ఎస్పీ అడ్డంకులు కల్పించారని ఓ రేంజ్ లో ఫైరయ్యారు ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి. ఆయనపై చర్య తీసుకోవాలని కిరణ్ కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ తీరుపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి గీతారెడ్డికూడా అసంతృప్తితో ఉన్నారు. ఐదు నెలల కిందట జిల్లాకు వచ్చిన వెంటనే డిపార్ట్ మెంట్ లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు మహంతి. పైరవీలతో ఏళ్ల తరబడి ఒకే చోట ఉద్యోగం చేస్తున్న సిబ్బందిని ట్రాన్స్ ఫర్ చేశారు. నేతల గన్ మెన్ లను కూడా మార్చేశారు. దీంతో ఎస్పీకి, మంత్రులకు మధ్య గ్యాప్ ఏర్పడింది. వినాయక చవితి మండపాలకు అనుమతినివ్వకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఎస్పీ ఉంటే ఆగస్టు 15 వేడుకలకు హాజరు కానని మంత్రి గీతారెడ్డి అన్నారంటే పరిస్థితి ఏలెవల్ కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నెల్లూరు జిల్లా పోలీస్ స్టోరీ కాస్త డిఫరెంట్. ఎస్పీ రమణకుమార్  డైరెక్టు సీఎం రికమండేషన్ పై  జిల్లాకు వచ్చారు. కొంతకాలం వరకు ఆనం బ్రదర్స్ తో బాగానే కలిసిపోయారు. డీజీపీగా దినేశ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక సీన్ మారింది. నేతల రికమండేషన్ పట్టించుకోవడం మానేశారు ఎస్పీ. హోంగార్డుల నియమాకాల్లో ఆనం సిఫార్సులు పనిచేయలేదు. ఇటీవల జరిగిన సీఐ, ఎస్ ఐల బదిలీల్లోనూ ఆనం సూచించిన వాళ్లకు  కోరుకున్న ప్లేస్ దక్కలేదు. దీంతో ఆనం వివేకా...ఎస్పీ రమణకుమార్ పై ఒంటికాలిపై లేచారు. 
వరంగల్ జిల్లాలో అర్బన్ ఎస్పీ శ్యాం సుందర్, మంత్రి బసవరాజు సారయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శ్యాం సుందర్ గతంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. అక్కడ లైంగిక వేధింపులు రావడంతో ఈ మధ్యే వరంగల్ కు బదిలీ అయ్యారు. నగరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్  పర్యటనలో  బసవరాజు సారయ్య కుమారుడు శ్రీమాన్... పోలీసులను దూషించారు. ఆగ్రహించిన ఎస్పీ ఆయనపై నాన్ బెయిల బుల్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు , మంత్రి  మధ్య విమర్శల వార్ మొదలయింది.
కృష్ణాజిల్లాలో  ఎస్పీ విజయ లక్ష్మికి ఎమ్మెల్యే జోగి రమేష్ , బందరు ఎమ్యెల్యే పేర్ని నాని మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎస్పీ తమ మాట వినడంలేదని డైరెక్టుగా సీఎం దగ్గరకు వెళ్లి తమ పనులు చేయించుకుంటున్నారు నేతలు . ముక్కుసూటిగా వ్యవహరించే విజయలక్ష్మి నేతల ఒత్తిళ్లను లెక్కచేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రభావం వల్ల పోలీస్ వ్యవస్థ  దెబ్బతింటుందని వాపోతున్నారు పోలీసు సంఘం అయితే నిజాయితీగా పనిచేసే  పోలీసు అధికారులపై నేతల విమర్శలు కామన్ అంటున్నారు జనం.  పొలిటికల్ ప్రెజర్ కు తలొగ్గకుండా విధినిర్వహణలో  ముందుకు సాగాలని  కోరుతున్నారు.