Thursday 8 November 2012



          ఖద్దర్ నేతలు వర్సెస్ ఖాకీ బాసులు  




    ప్రజాప్రతినిధులమన్న దర్పం ఒకరిది.... చట్టానికి ,న్యాయానికి రక్షకులమన్న ధీమా మరొకరిది. అధికార అహం శాసిస్తుంటే ... ఉద్యోగ ధర్మం ఎదరిస్తోంది. ఖద్దర్ చొక్కాలకూ  ఖాకీయూనిఫాం కూ పొసగడం లేదు . పాలక పార్టీకి సలామ్ చేయని పోలీసుల నైజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నేతలు . పోలిటికల్ లీడర్ల ఒత్తిళ్లను పోలీసు  సీతయ్యలు లెక్క చేయడంలేదు. దీంతో కొన్ని జిల్లాల్లో రెండు వర్గాల మధ్య డైరెక్ట్ వార్ నడుస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వెళ్లింది పరిస్థితి. మాట వినని  పోలీసు అధికారులను ట్రాన్స్ ఫర్ చేయాలని నాయకులు సీఎంపై ఒత్తిడి తెస్తుంటే ... ఎనీ ప్లేస్ .. ఎనీ టైమ్  డ్యూటీ ఎక్కడైనా ఒక్కటే .. దేనికైనా రెడీ అంటున్నారు ఖాకీ బాసులు .
పోలీసు ఉద్యోగమంటే  ఆషామాషీ కాదు. శాంతి భద్రతలతో పాటు రాజకీపరమైన అనేక ఒత్తిళ్లు ఉంటాయి. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. లేదంటే విమర్శలు , ట్రాన్స్ ఫర్లు తప్పవు. ఈ మధ్య పోలీసు వ్యవస్థపై పొలిటికల్ ప్రెజర్స్ ఎక్కువయ్యాయి.  ఖాకీల దిశ , దశను కూడా అధికార నేతలు శాసించే పరిస్థితి ఏర్పడింది. నాయకుల మాటకు ఎస్ అనని  ఎస్పీలపై వివాదాలు ముసురుకుంటున్నాయి.
        తాజాగా మెదక్ జిల్లా సీఎం ఇందిరమ్మ బాటలో స్థానిక ప్రజాప్రతినిధులకు  టార్గెట్ అయ్యారు ఎస్పీ అవినాశ్ మహంతి. ముఖ్యమంత్రి కాన్వాయ్ కు స్వాగత పలికేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం వివాదాస్పదమైంది. సీఎం పర్యటనకు ఎస్పీ అడ్డంకులు కల్పించారని ఓ రేంజ్ లో ఫైరయ్యారు ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి. ఆయనపై చర్య తీసుకోవాలని కిరణ్ కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ తీరుపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి గీతారెడ్డికూడా అసంతృప్తితో ఉన్నారు. ఐదు నెలల కిందట జిల్లాకు వచ్చిన వెంటనే డిపార్ట్ మెంట్ లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు మహంతి. పైరవీలతో ఏళ్ల తరబడి ఒకే చోట ఉద్యోగం చేస్తున్న సిబ్బందిని ట్రాన్స్ ఫర్ చేశారు. నేతల గన్ మెన్ లను కూడా మార్చేశారు. దీంతో ఎస్పీకి, మంత్రులకు మధ్య గ్యాప్ ఏర్పడింది. వినాయక చవితి మండపాలకు అనుమతినివ్వకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఎస్పీ ఉంటే ఆగస్టు 15 వేడుకలకు హాజరు కానని మంత్రి గీతారెడ్డి అన్నారంటే పరిస్థితి ఏలెవల్ కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నెల్లూరు జిల్లా పోలీస్ స్టోరీ కాస్త డిఫరెంట్. ఎస్పీ రమణకుమార్  డైరెక్టు సీఎం రికమండేషన్ పై  జిల్లాకు వచ్చారు. కొంతకాలం వరకు ఆనం బ్రదర్స్ తో బాగానే కలిసిపోయారు. డీజీపీగా దినేశ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక సీన్ మారింది. నేతల రికమండేషన్ పట్టించుకోవడం మానేశారు ఎస్పీ. హోంగార్డుల నియమాకాల్లో ఆనం సిఫార్సులు పనిచేయలేదు. ఇటీవల జరిగిన సీఐ, ఎస్ ఐల బదిలీల్లోనూ ఆనం సూచించిన వాళ్లకు  కోరుకున్న ప్లేస్ దక్కలేదు. దీంతో ఆనం వివేకా...ఎస్పీ రమణకుమార్ పై ఒంటికాలిపై లేచారు. 
వరంగల్ జిల్లాలో అర్బన్ ఎస్పీ శ్యాం సుందర్, మంత్రి బసవరాజు సారయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శ్యాం సుందర్ గతంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. అక్కడ లైంగిక వేధింపులు రావడంతో ఈ మధ్యే వరంగల్ కు బదిలీ అయ్యారు. నగరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్  పర్యటనలో  బసవరాజు సారయ్య కుమారుడు శ్రీమాన్... పోలీసులను దూషించారు. ఆగ్రహించిన ఎస్పీ ఆయనపై నాన్ బెయిల బుల్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు , మంత్రి  మధ్య విమర్శల వార్ మొదలయింది.
కృష్ణాజిల్లాలో  ఎస్పీ విజయ లక్ష్మికి ఎమ్మెల్యే జోగి రమేష్ , బందరు ఎమ్యెల్యే పేర్ని నాని మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎస్పీ తమ మాట వినడంలేదని డైరెక్టుగా సీఎం దగ్గరకు వెళ్లి తమ పనులు చేయించుకుంటున్నారు నేతలు . ముక్కుసూటిగా వ్యవహరించే విజయలక్ష్మి నేతల ఒత్తిళ్లను లెక్కచేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రభావం వల్ల పోలీస్ వ్యవస్థ  దెబ్బతింటుందని వాపోతున్నారు పోలీసు సంఘం అయితే నిజాయితీగా పనిచేసే  పోలీసు అధికారులపై నేతల విమర్శలు కామన్ అంటున్నారు జనం.  పొలిటికల్ ప్రెజర్ కు తలొగ్గకుండా విధినిర్వహణలో  ముందుకు సాగాలని  కోరుతున్నారు.

No comments:

Post a Comment