Tuesday 6 November 2012

          గడ్కరీకి బీజేపీ క్లీన్ చిట్ 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పదవి గండం తప్పింది. అధ్యక్షుడికి పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది. గడ్కరీపై కేజ్రీవాల్ ఆరోపణలు పూర్తిగా అవాస్తమని తేల్చేసింది. కంపెనీ లావాదేవీలు క్లియర్ గా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ ఎక్స్ ఫర్ట్ గురుమూర్తితో ఆడిట్ చేయించామన్నారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో రెండు గంటలపాటు పార్టీ కోర్ గ్రూఫ్ భేటీ అయింది. ఆ తర్వాత  సుష్మా స్వరాజ్ , అరుణ్ జైట్లీ సంయుక్త ప్రకటన  తయారుచేశారు. అవినీతి ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటామని రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి అగ్రనేత ఎల్ కే అద్వానీ డుమ్మా కొట్టారు. గడ్కరీకి క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ముందే తెలియడంతో  కోర్ గ్రూప్ భేటీని బహిష్కరించారు. పార్టీ నిర్ణయంపై ఆయన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.అద్వానీకి నచ్చచెప్పి మీటింగ్ కు తీసుకురావడానికి సుష్మతో పాటు మరికొందరు నేతలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ వ్యవహారంలో గురుమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించారు. అద్వానీతో భేటీ అయిన ఆయన ఆ తర్వాత  రాంజఠ్మలానీని కలిశారు. గడ్కరీ రాజీనామాపై వెనక్కి తగ్గాలని సూచించారు. దీనిపై స్పందించిన జెఠ్మలానీ గడ్కరీ  కంపెనీకి సంబంధించిన దస్తావేజులను పరిశీలిస్తానన్నారు.
గడ్కరీ ఇష్యూపై పార్టీ రెండుగా చీలిపోయింది. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని  ఓవర్గం...వద్దని మరో వర్గం మంతనాలు చేశాయి.  గడ్కరీపై అసమ్మతి అస్త్రం ఎక్కుపెట్టిన రాంజెఠ్మలానీతో సీనియర్లు యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సింగ్ భేటీ కావడం కలకలం రేపింది. మరోవైపు పదవిని దక్కించుకునేందుకు గడ్కరీ నేతల చుట్టూ చక్కర్లు కొట్టారు. సుష్మా స్వరాజ్ తో మంతనాలు జరిపారు.  ఓ దశలో గడ్కరీని సాగనంపి... అద్వానీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. మొత్తమ్మీద  గడ్కరీకి  ప్రస్తుతం పదవి గండం లేకపోయినా ...  ముందుముందు తిప్పలు తప్పేలా లేవు.

No comments:

Post a Comment