Sunday 23 September 2012


ఛార్జీల మోత


ఆర్టీసీ బస్సెక్కితే బాదుడే.... డీజిల్ ధర పెంపును సాకుగా చూపుతూ ఛార్జీలను భారీగా పెంచేసింది... రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ప్రయాణికులను వీరబాదుడు బాదింది. భారీగా చార్జీలు పెంచి జనంపై 363 కోట్ల భారం మోపింది. సంపన్నులు ప్రయాణించే ఏసీ బస్సులను వదిలేసి  గ్రామీణ , మధ్య తరగతి ప్రయాణించే పల్లె వెలుగు , సూపర్ లగ్జరీ సర్వీసులపై చార్జీల మోత మోగించింది. పల్లె వెలుగు  బస్సు ఛార్జీని కిలో మీటరకు 5 పైసులు పెంచింది. ఎక్స్ ప్రెస్ , డీలక్స్ లకు కిలోమీటరకు 10 పైసలు , సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు 12 పైసలు హైక్ చేసింది. ఇటీవల కేంద్రం పెంచిన డీజిల్ ధర భారాన్ని ప్రయాణికులపై మోపింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. సిటీ ఆర్డినరీలో మినిమమ్ ఛార్జి 5 రూ.లు చేసింది. గతంలో 4 రూ. మినిమమ్ ఛార్జిగా ఉండేది. పెరిగిన చార్జీలు సోమవారం  నుంచి అమల్లోకి రానున్నాయి.  

ఫ్లెక్సీ ఫేర్ విధానం
రద్దీని బట్టి ఛార్జీలు పిండుకునేందకు కొత్తగా  ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని ప్రవేశ పెట్టింది ఆర్టీసీ. ఇప్పటికే పండుగ, జాతర సమయాల్లో ప్రయాణికులను అడ్డంగా దోచుకుంటున్న ఆర్టీసీ... ఇకపై వారాంతపు రోజులతో పాటు ముఖ్యమైన దినాల్లో ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేయనుంది. ఆర్డినరీ జనరల్ బస్ టికెట్ తో పాటు మెట్రో  డీలక్స్ పాస్ లపై  అదనంగా 100 రూపాయలు బారం పడింది. 14 నెలల్లో బస్సు చార్జీలు పెరగడం ఇది రెండోసారి. నష్టాల నుంచి బయటపడేందుకు ఛార్జీలు పెంచకతప్పలేదుంటున్నారు ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్. ఛార్జీల పెంపుపై  సామాన్యులతో పాటు విపక్షాలు  భగ్గున మండిపడ్డాయి.  ప్రజలపై భారం మోపేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని ఫైరయ్యాయి. ప్రైవేట్ సంస్థల అక్రమ రవాణను అరికడితే 1200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయంగా వస్తుందని సూచించారు సీపీఐ కార్యదర్శి నారాయణ

Wednesday 19 September 2012


అన్నా బృందంలో చీలిక

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో కేంద్రానికి కంటిమీద కునుకులేకుండా చేసిన అన్నా హజారే బృందం నిట్టనిలువునా చీలిపోయింది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఏర్పడిన విభేదాలు రెండు వర్గాలుగా విడిపోయేలా చేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ, పార్టీ ఏర్పాటపై చర్చించేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం వాడివేడిగా జరిగింది. 9 గంటల పాటు జరిగిన  భేటీలో రెండు వర్గాలు మాటల దాడికి దిగాయి. పార్టీ వద్దంటున్న హన్నాను  కిరణ్ బేడీ, సంతోష్ హెగ్డే సపోర్టు చేశారు. కేజ్రీవాల్ కు ప్రశాంత్ భూషణ్ , శాంత్ భూషణ్ లు మద్దతుగా పలికారు. హజారే ను కేజ్రీవాల్ టీమ్  సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఓ వర్గం ఫైరైంది. అయితే  అన్నాను  ఇప్పటి అన్నాగా తీర్చిదిద్దింది ఢిల్లీ వాసులేనని వ్యతిరే వర్గం ఘాటుగా సమాధానమిచ్చింది.
తన బృందం విడిపోవడం దురదృష్టకరమన్నారు హజారే. తాను ఏ పార్టీలో చేరేదిలేదని మరోసారి స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కు పార్టీని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు. అయితే తన పేరును, ఫోటోను ప్రచారానికి వాడుకోవద్దని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు  మెజారిటీ ప్రజలు మద్దతిచ్చారన్న కేజ్రీవాల్ సర్వే ఫలితాలను హజారే తోసిపుచ్చారు. రాజకీయ బాట పట్టే వారికి తన  ఆశీర్వాదాలుంటాయంటూనే... తాము భిన్న మార్గాలను ఎంచుకున్నామన్నారు. పటిష్టమైన లోక్ పాల్ పై జనంలో చైతన్యంతెచ్చేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. కేంద్రం బిల్లునైనా తేవాలని లేదంటే తన చావునైనా చూడాలని హెచ్చరించారు. మరోవైపు దేశం అమ్మాకాని సిద్ధంగా ఉందని   ట్విట్టర్ లో తెలిపారు కేజ్రీవాల్  . దేశాన్ని రక్షించేందుకు చేయాల్సిందంతా చేస్తానన్నారు. కేజ్రీవాల్ తో తెగతెంపులు చేసుకున్న  హజారే ఢిల్లీలో యోగా గురువు బాబా రామ్ దేవ్ తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.

Tuesday 18 September 2012




కేంద్రానికి మమతా బెనర్జీ షాక్

కేంద్రంలో అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వంనుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలగాలని మంగళవారం సాయంత్రం నిర్ణయించుకుంది.  తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ నాయకత్వంలో కలకత్తాలోని ఆ పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.  యు.పి.ఎ. సంకీర్ణ ప్రభుత్వం నుంచి నిష్క్రమించాలని భేటీ నిర్ణయించారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంనుంచి దేశం దృష్టిని మరల్చడానికే కేంద్రం ఎఫ్.డి.ఐ.లను రంగంమీదికి తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం పదే పదే ధరలు పెంచుతున్నందున తమకు గత్యంతరం లేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె చెప్పారు. కేంద్రంలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, డీజిల్ ధరల పెంపు విషయంలో గాని, గ్యాస్ సిలిండర్ల తగ్గింపు విషయంలో గాని, రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విషయంలో గాని కేంద్ర ప్రభుత్వం తమతో సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది.

అయితే కాంగ్రెస్ వర్గాలు ఈ వాదనతో ఏకీభవించడంలేదు. దేశ ఆర్థిక పరిస్థితి గురించీ, ఇంధనం పరిస్థితి గురించీ ముందునుంచీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు చెబుతూనే ఉన్నామని వారు అంటున్నారు. మూడు రోజుల క్రితం కూడా ప్రధాని ప్రభుత్వ వైఖరిని వివరించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెప్పారు. అయితే తర్వాత మాట్లాడతానని మమత అంతటితో ఆ సంభాషణను ముగించినట్టు తెలుస్తున్నది.

ముప్ఫై ఏళ్ల వామపక్ష పాలనలో పశ్చిమ బెంగాల్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి రైల్వే శాఖను ఉపయోగించుకుని పశ్చిమ బెంగాల్ యువకులకు కొన్ని ఉద్యోగాలు కల్పించడం ద్వారా పరపతిని పెంచుకోవాలన్నది మమత వ్యూహం. అలాగే కనీసం పది వేల కోట్ల ఉద్దీపనాలు ఇవ్వాలని ఆమె కొంత కాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. రైల్వే శాఖ ఉంచుకోవచ్చు గాని ఉద్దీపనాలు ఇవ్వలేమని, ఒకరికి ఉద్దీపనాలు ఇవ్వడం మొదలు పెడితే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే విధంగా ఒత్తిడి తీసుకురావచ్చునని కాంగ్రెస్ తమ అశక్తతను ముందే వ్యక్తం చేసింది.

అయితే ప్రస్తుత పరిస్థితులలో తృణమూల్‌కు చెందిన 19 మంది టి.ఎం.సి. పార్లమెంటు సభ్యులు యు.పి.ఎ. నుంచి బయటకు వచ్చినా అటు సమాజ్ వాది పార్టీ 22 మంది పార్లమెంటు సభ్యులతోనూ, మాయావతి తమ 21 మంది బి.ఎస్.పి. పార్లమెంటు సభ్యులతోనూ యు.పి.ఎ. ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత యు.పి.ఎ. ప్రభుత్వం నిలబడాలంటే 272 మంది సభ్యుల మద్దతు అవసరం. తృణమూల్ వెళ్లిపోయినా ఎస్.పి, బి.ఎస్.పి. మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు.