Tuesday 18 September 2012




కేంద్రానికి మమతా బెనర్జీ షాక్

కేంద్రంలో అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వంనుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలగాలని మంగళవారం సాయంత్రం నిర్ణయించుకుంది.  తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ నాయకత్వంలో కలకత్తాలోని ఆ పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.  యు.పి.ఎ. సంకీర్ణ ప్రభుత్వం నుంచి నిష్క్రమించాలని భేటీ నిర్ణయించారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంనుంచి దేశం దృష్టిని మరల్చడానికే కేంద్రం ఎఫ్.డి.ఐ.లను రంగంమీదికి తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం పదే పదే ధరలు పెంచుతున్నందున తమకు గత్యంతరం లేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె చెప్పారు. కేంద్రంలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, డీజిల్ ధరల పెంపు విషయంలో గాని, గ్యాస్ సిలిండర్ల తగ్గింపు విషయంలో గాని, రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విషయంలో గాని కేంద్ర ప్రభుత్వం తమతో సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది.

అయితే కాంగ్రెస్ వర్గాలు ఈ వాదనతో ఏకీభవించడంలేదు. దేశ ఆర్థిక పరిస్థితి గురించీ, ఇంధనం పరిస్థితి గురించీ ముందునుంచీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు చెబుతూనే ఉన్నామని వారు అంటున్నారు. మూడు రోజుల క్రితం కూడా ప్రధాని ప్రభుత్వ వైఖరిని వివరించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెప్పారు. అయితే తర్వాత మాట్లాడతానని మమత అంతటితో ఆ సంభాషణను ముగించినట్టు తెలుస్తున్నది.

ముప్ఫై ఏళ్ల వామపక్ష పాలనలో పశ్చిమ బెంగాల్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి రైల్వే శాఖను ఉపయోగించుకుని పశ్చిమ బెంగాల్ యువకులకు కొన్ని ఉద్యోగాలు కల్పించడం ద్వారా పరపతిని పెంచుకోవాలన్నది మమత వ్యూహం. అలాగే కనీసం పది వేల కోట్ల ఉద్దీపనాలు ఇవ్వాలని ఆమె కొంత కాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. రైల్వే శాఖ ఉంచుకోవచ్చు గాని ఉద్దీపనాలు ఇవ్వలేమని, ఒకరికి ఉద్దీపనాలు ఇవ్వడం మొదలు పెడితే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే విధంగా ఒత్తిడి తీసుకురావచ్చునని కాంగ్రెస్ తమ అశక్తతను ముందే వ్యక్తం చేసింది.

అయితే ప్రస్తుత పరిస్థితులలో తృణమూల్‌కు చెందిన 19 మంది టి.ఎం.సి. పార్లమెంటు సభ్యులు యు.పి.ఎ. నుంచి బయటకు వచ్చినా అటు సమాజ్ వాది పార్టీ 22 మంది పార్లమెంటు సభ్యులతోనూ, మాయావతి తమ 21 మంది బి.ఎస్.పి. పార్లమెంటు సభ్యులతోనూ యు.పి.ఎ. ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత యు.పి.ఎ. ప్రభుత్వం నిలబడాలంటే 272 మంది సభ్యుల మద్దతు అవసరం. తృణమూల్ వెళ్లిపోయినా ఎస్.పి, బి.ఎస్.పి. మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు.

No comments:

Post a Comment