Friday 1 March 2013



               హైదరాబాద్ లో ఆర్డీఎక్స్ 
  
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో  ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకివస్తున్నాయి. అనుమానితుల విచారణలో భయంకమైన నిజాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన హైదరాబాద్ లో అత్యంత ప్రమాదకరమైన  పేలుడు పదార్థం ఆర్డీఎక్స్  భారీగా  నిల్వ ఉన్నట్లు తేలింది.పాకిస్తాన్ నుంచి వయా బంగ్లాదేశ్ మీదుగా ఆర్ఢీఎక్స్ ఇండియాకు తరలించామని పేలుళ్ల నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ముంబై పేళ్లలో మొదటిసారిగా ఆర్డీఎక్స్ ఉపయోగించి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు ముష్కరులు. జైపూర్, మక్కా పేలుళ్లలో కూడా ఆర్డీఎక్స్ జాడలు కనిపించాయి. ఆ తర్వాత ముంబై రైళ్లలో ఆర్డిఎక్స్ ఆమర్చి పేలుళ్లకు తెగబడ్డారు టెర్రరిస్టులు.
1997లో  జునైద్ అలియాస్  ఇస్తియాక్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు పది కేజీల ఆర్డిఎక్స్ పట్టుకొచ్చినట్లు సమాచారం. ఇందులో మూడు కేజీలు కాశ్మీర్ లో పట్టుపడింది. మిగిలిన ఏడు కేజీలు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 1999లో సెంట్రల్ ఐబీ  అధికారులు ఆరు నెలలు కష్టపడి జునైద్ ను శివరాంపల్లిలో పట్టుకున్నారు. ఇతడి సహచరుడు సాజిద్ ను  కూడా అరెస్ట్ చేశారు. కానీ , వాళ్ల నుంచి ఆర్డీ ఎక్స్ ను స్వాధీనం చేసుకోలేపోయారు. కొంతమంది పోలీసులు అధికారులు సాజిద్ ను ఇన్మాఫార్మర్ గా మార్చి బంగ్లాదేశ్ పంపించారు. అయితే రెండేళ్ల తర్వాత అతడు ఐఎస్ ఐ ఏజెంట్ గా పశ్చిమబెంగాల్ లో ప్రత్యక్షమయ్యాడు. అసలు ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ సరిహద్దులు ఎలా దాటుతోంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కేజీల కొద్దీ ఆర్డిఎక్స్ ఇండియాకు దిగుమతి అవుతుంటే మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? భద్రతా బలగాలు కళ్లుమూసుకుంటున్నాయా? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
వందలామంది స్లీపర్ సెల్స్ నగరంలో తలదాచుకుంటున్నారు. అడపాదడపా ఒకరిద్దరు టెర్రరిస్టులు పట్టుపడుతున్నా... వాళ్ల దగ్గరున్న పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. దేశ, విదేశాలలలోని టేర్రరిస్టు బాసుల మాటలు సీక్రెట్ గా వింటున్న పోలీస్ అధికారులు... స్ధానికంగా ఉండే స్లీపర్ సేల్స్ ను పసిగట్టలేకపోతున్నారు.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్ తో తయారు చేసిన బాంబులు వినియోగించారు  ముష్కరులు . ఒక వేళ ఆర్డీఎక్స్ వాడి ఉంటే ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉండేదో ఊహించడం కష్టమే.  హైదరాబాద్ కు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకోకుంటే ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి తెగబడే అవకాశముందంటున్నాయి.