Monday 29 October 2012


కిరణ్ కు సోనియా ఝలక్ 
  నవ్విన నాపచేనే పండిందన్న సామెత రాష్ట్రం నుంచి కొంతగా ఎంపికైన మంత్రుల విషయంలో నిజమైంది. తమకు మంత్రి పదవొస్తుందని ముందే చెప్పిన ఎంపీలను చూసి సీఎం కిరణ్ నవ్వుకున్నారట. కెబినెట్ మినిస్టర్ అంటే తామాషా అనుకున్నారా?   నాతో అన్నారు సరే .... వేరేవాళ్లకు చెప్పకండి అభాసుపాలవుతారని వెటకారమాడారట. ఫోన్ చేసి , మిమ్మిల్ని ఎవరో ఆటపట్టిస్తున్నారని చెప్పారట.  ఢిల్లీలో ఏం జరిగినా అంతా తనకు తెలుస్తుందన్నది  సీఎం ధీమా . హైకమాండ్ తనను  సంప్రదించకుండా  మంత్రుల ఎంపిక చేయదని  పిచ్చి భ్రమ. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత   కిరణ్ ముఖం  తెల్లబోయింది. సీఎంను  చూసి నవ్వుకోవడం మంత్రుల వంతైంది. పాపం రబ్బర్ స్టాంప్ ... సీఎం కు ఏమీ తెలియదని జోకులేసుకున్నారు నేతలు.  
సెంట్రల్ క్యాబినెట్ రీషపిలింగ్ లో  సీఎం కు జలక్ ఇచ్చింది హైకమాండ్. మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి ఐదుగురిని తీసుకుంటున్నట్లు మాటమాత్రమైన కిరణ్ కు చెప్పలేదు. సీఎం ను సంప్రదించకుండానే తన దగ్గరున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం మంత్రుల పేర్లు ఖారారు చేసింది. ముఖ్యమంత్రిని కూరలో కరివేపాకులా పక్కన పెట్టింది . దీంతో ముఖం చిన్నబోయింది. ఇది దేనికి సంకేతమన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కిరణ్ కు రోజులు దగ్గరపడ్డాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సహజంగా కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేర్పులను చివరి నిమిషం దాకా చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ.. ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించింది అధిష్ఠానం. నాలుగు రోజుల ముందే సోనియాతో పాటు యువనేత రాహుల్ గాంధీ స్వయంగా ఎంపీలకు ఫోన్ చేసి, మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చెప్పి అభినందించారు. కేబినెట్ కార్యదర్శి కూడా ఎంపీలకు ఫోన్ చేసి 28న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది ... 27 నాటికి అందుబాటులో ఉండాలని చెప్పారు.. ఎవరికి మంత్రి పదవి స్తుందన్న విషయం పేర్లతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా ఒక్క రోజు మందువరకు సీఎం విషయం తెలియకపోవడం ఆశ్చర్యం.
 ఇక్కడ మరో విశేషమేమంటే.. తమకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చందని ఎంపీలు స్వయంగా కిరణ్ కు చెప్పినా ఆయన లైట్ గా తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదంటే ఆషామాషీ అనుకుంటున్నారా?  అంటూ వెటకారమాడారట. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఉన్న  బలరాం నాయక్ కు ఫోన్ చేసి మరీ తన హాస్య చెతురత ప్రదర్శించారు సీఎంగారు. 26న గాంధీభవన్ లో జరిగిన మీటింగ్ లో కిల్లి కృపారాణికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు మంత్రి పదవి వస్తుందని సీఎంకు చెబితే లోలోపల నవ్వుకున్నారట.
రాష్ట్రం నుంచి ఒక్కరిద్దరికే కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని కిరణ్ భావించారు. చిరంజీవితో పాటు మరొకరి చాన్సు ఉంటుందనుకున్నారు. ఏకంగా ఐదురుగికి అవకాశం కల్పించింది అధిష్టానం. కొన్ని రోజుల కిందటే సోనియాను కలిసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని సోనియా హామీ ఇచ్చారట. బంధువుల పెళ్లికార్డు ఇచ్చేందుకు సోనియా దగ్గరికి వెళ్లిన సర్వేకు .. తీపి కబురు చెప్పారట మేడమ్. బలరాం నాయక్ ను 15 రోజుల కిందటే రాహుల్ గాంధీ పిలిపించి మాట్లాడరట. మొత్తమ్మీద ప్లాన్ ప్రకారమే హైకమాండ్ సీఎం కు తిలియకుండా సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Sunday 28 October 2012




 జైపాల్ కు రిలయన్స్ ఎఫెక్ట్ 


ముక్కుసూటి తనమే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కి ముప్పు తెచ్చిందా? రిలయన్స్  ఒత్తిడి వల్లే ఆయన్ను పెట్రోలియం శాఖ నుంచి తప్పించారా? జైపాల్ కు వ్యతిరేకంగా ఆయిల్ కంపెనీల లాబీయింగ్  కు కేంద్రం తలొగ్గిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒత్తిళ్లకు లొంగకుండా సమర్థవంతంగా పనిచేయడమే జైపాల్ సీటు మార్చిందని చెబుతున్నారు. 
కేంద్ర కేబినెట్ పునర్వవస్థీకరణలో అనూహ్యమార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించని విధంగా ఎక్కువమంది కొత్త వారికి అవకాశం లభించింది. అయితే ఉత్తమ పార్లమెంటేరియన్ , సీనియర్ మినిస్టర్ జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖ నుంచి శాస్త్ర సాంకేతిక శాఖ అప్పగించడం చర్చనీయాంశమైంది . ఆయిల్ కంపెనీల ఒత్తిడి వల్లే   జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రిలయన్స్  అధినేత ముఖేస్ అంబానీ లాబీయింగ్ పనిచేసినట్లు స్పష్టమవుతోంది. జైపాల్ ను మార్చాలని రిలయన్స్  సంస్థ  కొంత కాలంగా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఎవరి మాట వినకుండా స్వతంత్రంగా వ్యవహరించడం ఆయిల్ కంపెనీలకు మింగుడు పడలేదు.లాలూచీలకు , లాబీయింగ్ కు  తలొంచని జైపాల్ నైజం వల్ల రిలయన్స్ కు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.  జైపాల్ బాధ్యతలు చేపట్టాకా  కేజీ బేసిన్ విషయంలో రిలయన్స్ తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకివచ్చాయి. రిలయన్స్ కు వ్యతిరేకంగా కాగ్  ఇచ్చిన నివేదికపై  దేశవ్యాప్తంగా  దుమారం రేగింది. లక్ష్యానికి ఆమడ దూరంలో ఉందని గుర్తించిన కేంద్రం రిలయన్స్ కు బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.  అలాగే కేజీబేసిన్ పెట్రో రేటు పెంచుకోవడానికీ రిలయన్స ప్రయత్నించింది. ఈ విషయంలోనూ జైపాల్ స్ట్రిక్ట్ గా వ్యవహరించారు. ఆయన తీరు రిలయన్స్ కు తలనొప్పులు తెచ్చిపెట్టిన ఈ గండం నుంచి బయటపడేందుకు రిలయన్స్ అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు జైపాల్ రెడ్డిని ఆ శాఖ నుంచి తప్పిస్తే తప్ప ప్రయోజనం లేదని డిసైడైనట్లు సమాచారం.
అయితే ఆయిల్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి జైపాల్ రెడ్డి శాఖను మార్చడాన్ని తప్పుపడుతున్నారు విశ్లేషకులు . రాజకీయ మేధావిగా , మంచి విలువలున్న నేతగా గుర్తింపు పొపందిన జైపాల్  గతంలో   కేంద్ర సమాచార శాఖ మంత్రిగా కొత్త ఒరవడి సృష్టించారు. వివాదాలను దాటి... ప్రసారభారతి బిల్లు తీసుకొచ్చారు. ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడూ... ఆయన్ను పదవి మార్చడంపై అనుమానాలు వచ్చాయి. అప్పట్లోనూ రిలయన్స్ లాబీయింగే పనిచేసిందని విమర్శలున్నాయి. మొత్తమ్మీద సీనియర్ మంత్రి జైపాల్ కు కేబినెట్ మార్పుల్లో హోదా మారకపోయినా... కీలకశాఖ పోవడం డిమోషన్ గానే భావిస్తున్నారు.  సమర్థుడైన నేతకు ప్రాధాన్యం లేని శాఖను అప్పగించారన్న విమర్శలు వస్తున్నాయి. 


 


కేంద్రమంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ లో కొందరికి జాక్ పాట్ తగిలింది. మరికొందరికి టైమ్ బ్యాడ్ గా మారింది. కొత్త ఎంపీలను అనుకోకుండా మంత్రి పదువులు వరించాయి. ఇక సీనియర్ల మినిస్టర్ల శాఖలు తారుమారయ్యాయి. పదవి ఊడడం ఖాయమనుకున్న వాళ్లకు ప్రాధాన్యత కలిగిన శాఖలను అప్పగించడం విశేషం.ఊహించినట్లుగానే  రాహుల్ టీమ్ లోని యంగ్ స్టర్స్ జ్యోతిరాధిత్య సింథియా, సచిన్ పైలెట్ లకు పదోన్నతలు లభించాయి. జ్యోతిరాధిత్య సింధియా కు విద్యుత్ శాఖ, సచిన్ పైలట్ కు  కార్పొరేట్ వ్యవహారా శాఖ బాధ్యతలు అప్పగించారు. సహాయమంత్రిగా పనిచేసిన పళ్లం రాజుకు మానవ వనురల అభివృద్ధి శాఖకు మినిస్టర్ గా ప్రయోట్ అయ్యారు.  జోడు పదవులు నిర్వహించిన కపిల్ సిబాల్ , వీరప్ప మొయిలీ పదువుల్లో కోత పెట్టి కొత్త బాధ్యతలు అప్పగించారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న వీరప్పమొయిలీకి ఈ సారి పెట్రోలియం శాఖ  దక్కింది. ఇప్పటి వరకు పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డికి అంతగా ప్రాధాన్యత లేని శాస్త్ర సాంకేతిక శాఖ అప్పగించారు.
తృణమూల్ కాంగ్రెస్ మినిస్టర్ రాజీనామాతో ఖాళీగా ఉన్న రైల్వేశాఖకు పవన్ కుమార్ బన్సాల్ కు అప్పగించారు. ఇప్పటి వరకు పవన్ కుమార్ బన్సాల్  నిర్వహించిన జలవనరుల శాఖను కొత్తగా  హరీశ్ రావత్ కు కేటాయించారు.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ ఖుర్షీద్ ను తప్పించడం ఖాయమనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఆయనకు విదేశీ వ్యవహారాల శాఖకు మార్చారు.  కుర్షీద్ నిర్వహించిన న్యాయ శాఖను అశ్విన్ కుమార్ కు ఇచ్చారు. ఇక విస్తరణలో ప్రమోషన్ కన్ఫామ్ అనుకున్న పురందేశ్వరికీ బ్రేక్ పడింది. స్థానిక రాజకీయ సమీకరణల వల్లే చివరినిమిషంలో ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ వచ్చినట్లే వచ్చి, చివరి నిమిషంలో చేయిజారీ పోవడంతో పురందేశ్వరి తీవ్ర నిరాశకు గురయ్యారు. 
మొత్తమ్మీద కేంద్రకేబినెట్ విస్తరణ  కొందరికి ఆనందాన్ని పంచగా... మరికొందరికి అసంతృప్తిని మిగిల్చింది. పదవులు తారుమారైన నేతలు  నిరాశకు లోను కాగా  ... జాక్ పాట్ తగిలిన నేతలు సంబరాలు చేసుకున్నారు.

కొత్త మంత్రుల ప్రమాణం 

కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో 22 మంది కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఏడుగురుకి కేబినెట్ హోదా... ఇద్దరికి స్వతంత్ర్య హోదా లభించింది. మిగిలిన వాళ్లు సహాయ మంత్రుల హోదా కల్పించారు. క్యాబినెట్  విస్తరణలో కాంగ్రెస్ యవరాజు రాహుల్ గాంధీ మార్క్ కనిపించింది. మంత్రివర్గంలో యువరక్తం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఊహించని విధంగా  అనేక కొత్త ముఖాలకు  మంత్రులుగా అవకాశం కల్పించారు. సీనియర్ మంత్రుల శాఖలను కూడా మార్చారు. 2014 ఎలక్షన్స్  టార్గెట్ గా  జరిగిన మంత్రి వర్గ పునర్వ వ్యవస్థీకరణలో  రెహ్మాన్ ఖాన్ - మైనార్టీ  వ్యవహారాల శాఖ , దిన్షా పటేల్ - గును శాఖ, అజయ్ మాకెన్ -  హౌసింగ్ , పట్టణాభివృద్ధి శాఖ , అశ్విన్ కుమార్ న్యాయశాఖ, హారీశ్ రావత్  - న్యాయశాఖ ,  చంద్రేశ్ కుమారి ఖటోచ్ సాంస్కృతిక శాఖ , ఆంధ్ర ప్రదేశ్ నుంచి చిరంజీవి పర్యాటక శాఖ , మనిష్ తివారీ కి సమచార, ప్రసార శాఖ మంత్రిగా  స్వంతంత్ర్య హోదా కల్పించారు.
 మానవ వనరుల సహాయ మంత్రిగా శశిథరూర్, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా కె. సురేశ్, వ్యవసాయ, పరిశ్రమల శాఖ సహాయమంత్రగా తారిఖ్ అన్వర్ , గిరిజన  సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా  రాణా నారా, రైల్వే శాఖ సహాయమంత్రిగా అధీర్ రంజన్  చౌదరి, వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఏహెచ్ ఖాన్ చౌదరి , పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా దీప్ దాస్ మున్షీ , మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ఎరింగ్ , రక్షణ శాఖ సహాయమంత్రిగా  లాల్ చంద్ కటారియా , ఆంధ్ర ప్రదేశ్ నుంచి  రైల్వే శాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సామాజిక , న్యాయశాఖ సహాయమంత్రిగా  బలరాం నాయక్ , రోడ్లు , రవాణా శాఖ సహాయ మంత్రిగా సర్వే సత్యనారాయణ, కమ్యూనికేషన్ ,టెక్నాలజీ సహాయ మంత్రిగా కిల్లి కృపారాణి కి పదవులు లభించాయి.
రాహుల్ గాంధీని కూడా మంత్రి వర్గంలోకి ఆహ్వానించినట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. అయితే ఆయన పార్టీ బలోపేతానికి సేవలందించాలని భావిస్తున్నట్లు వివరించారు. మధ్యంతర ఎన్నికల ఊహగానాలకు తెరదించారు ప్రధాని . ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదన్నారు. 2014 వరకు ఇదే చివరి మంత్రి వర్గ విస్తరణని స్పష్టం చేశారు. కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా , రాహుల్ గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్  , పలువురు ఎంపీలు , కొత్తగా ప్రమాణం  చేసిన మంత్రుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణం చేసిన నేతలంతా సోనియా, రాహుల్ కు కృతజ్ఞతలు తెలిపారు . కానీ, పక్కనన్న ప్రధానివైపు కన్నెత్తి చూడలేదు.