Wednesday 17 October 2012

గడ్కరీ అవినీతి చిట్టా విప్పిన కేజ్రీవాల్ 


    నిన్నటి వరకు అధికార పక్షంపై దండెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు కేజ్రీవాల్ ... ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారు. ఏకంగా బీజేపీ అధ్యక్షుడు గడ్కరీ అవినీతి చిట్టాను బయటపెట్టారు. మహారాష్ట్రలో అధికారపార్టీతో కుమ్మక్కై ప్రధానం లూఠీ చేశారని ఆరోపించారు. గడ్కరీని  రాజకీయ నేత అనడకంటే వ్యాపారవేత్తగా పిలవడం బాగుంటుందన్నారు.
అవినీతిపై అలుపెరగని  పోరాటం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ అధికార , ప్రతిపక్షం అన్న తేడాలేకుండా.. నేతలందరికీ నిద్ర లేకుండా చేస్తున్నాడు.వరుసగా ఒక్కొక్కరి అవినీతి చిట్టాను బయట పెడుతున్నారు. తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అల్లుడు వాద్రా అవినీతి బాగోతాన్ని మీడియాకు వివరించిన కేజ్రీవాల్ ... ఆ తర్వాత కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్జీద్  అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ అవినీతిని బయటపెట్టారు. సమాచారా హక్కు చట్టం పేరుతో సేకరించిన డాక్యుమెంట్లను ఆధారాలతో మీడియాముందుంచారు..  మహారాష్ట్ర నీటిపారుదల కుంభకోణంలో గడ్కరీ పాత్ర ఉందని ఆరోపించారు కేజ్రీవాల్ .  సర్కారు అవినీతిపై పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారని విమర్శించారు. విదర్భలో రైతులను భూములను గడ్కరీ అక్రమంగా లాక్కున్నారంటూ అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేశారు. . రైతుల ఆత్మహత్యలకు గడ్కరీ కారణమని  అని ఆరోపించారు కేజ్రీవాల్ .
గడ్కరీకి మహారాష్ట్రలో పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉందన్న కేజ్రీవాల్. ఆయనకు ఐదు చక్కెర కర్మాగారాలు , మూడు విద్యుత్ పరిశ్రమలు ఉన్నాయన్నారు  . ఈ పరిశ్రమలకు ప్రభుత్వం అక్రమంగా నీటిని సరఫరా చేస్తోందన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాస్త తన స్వార్థం కోసం అధికార పక్షానికి మిత్రపక్షంలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. గడ్కరీ తన లాభాపేక్ష కోసం... ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. 
కేజ్రీవాల్ ఆరోపణలను కొట్టిపారేసింది భారతీయ జనతా పార్టీ. భూ కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు పార్టీ అధ్యక్షుడు గడ్కరీ. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధమన్నారు. గడ్కరీకి పూర్తి మద్దతు పలికింది..బీజేపీ. గడ్కరీకి ఎంతో రాజకీయ అనుభవం ఉందనీ ఇన్నేళ్ల చరిత్రతో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని నేతలు కితాబిచ్చారు. కేజ్రీవాల్ కేవలం సంచలనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు . మొత్తానికి కేజ్రీవాల్ ఆరోపణలు రాజకీయంగా... భారీ దుమారాన్నే.. లేపింది. మరి ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment