Sunday 28 October 2012




 జైపాల్ కు రిలయన్స్ ఎఫెక్ట్ 


ముక్కుసూటి తనమే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కి ముప్పు తెచ్చిందా? రిలయన్స్  ఒత్తిడి వల్లే ఆయన్ను పెట్రోలియం శాఖ నుంచి తప్పించారా? జైపాల్ కు వ్యతిరేకంగా ఆయిల్ కంపెనీల లాబీయింగ్  కు కేంద్రం తలొగ్గిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒత్తిళ్లకు లొంగకుండా సమర్థవంతంగా పనిచేయడమే జైపాల్ సీటు మార్చిందని చెబుతున్నారు. 
కేంద్ర కేబినెట్ పునర్వవస్థీకరణలో అనూహ్యమార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించని విధంగా ఎక్కువమంది కొత్త వారికి అవకాశం లభించింది. అయితే ఉత్తమ పార్లమెంటేరియన్ , సీనియర్ మినిస్టర్ జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖ నుంచి శాస్త్ర సాంకేతిక శాఖ అప్పగించడం చర్చనీయాంశమైంది . ఆయిల్ కంపెనీల ఒత్తిడి వల్లే   జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రిలయన్స్  అధినేత ముఖేస్ అంబానీ లాబీయింగ్ పనిచేసినట్లు స్పష్టమవుతోంది. జైపాల్ ను మార్చాలని రిలయన్స్  సంస్థ  కొంత కాలంగా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఎవరి మాట వినకుండా స్వతంత్రంగా వ్యవహరించడం ఆయిల్ కంపెనీలకు మింగుడు పడలేదు.లాలూచీలకు , లాబీయింగ్ కు  తలొంచని జైపాల్ నైజం వల్ల రిలయన్స్ కు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.  జైపాల్ బాధ్యతలు చేపట్టాకా  కేజీ బేసిన్ విషయంలో రిలయన్స్ తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకివచ్చాయి. రిలయన్స్ కు వ్యతిరేకంగా కాగ్  ఇచ్చిన నివేదికపై  దేశవ్యాప్తంగా  దుమారం రేగింది. లక్ష్యానికి ఆమడ దూరంలో ఉందని గుర్తించిన కేంద్రం రిలయన్స్ కు బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.  అలాగే కేజీబేసిన్ పెట్రో రేటు పెంచుకోవడానికీ రిలయన్స ప్రయత్నించింది. ఈ విషయంలోనూ జైపాల్ స్ట్రిక్ట్ గా వ్యవహరించారు. ఆయన తీరు రిలయన్స్ కు తలనొప్పులు తెచ్చిపెట్టిన ఈ గండం నుంచి బయటపడేందుకు రిలయన్స్ అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు జైపాల్ రెడ్డిని ఆ శాఖ నుంచి తప్పిస్తే తప్ప ప్రయోజనం లేదని డిసైడైనట్లు సమాచారం.
అయితే ఆయిల్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి జైపాల్ రెడ్డి శాఖను మార్చడాన్ని తప్పుపడుతున్నారు విశ్లేషకులు . రాజకీయ మేధావిగా , మంచి విలువలున్న నేతగా గుర్తింపు పొపందిన జైపాల్  గతంలో   కేంద్ర సమాచార శాఖ మంత్రిగా కొత్త ఒరవడి సృష్టించారు. వివాదాలను దాటి... ప్రసారభారతి బిల్లు తీసుకొచ్చారు. ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడూ... ఆయన్ను పదవి మార్చడంపై అనుమానాలు వచ్చాయి. అప్పట్లోనూ రిలయన్స్ లాబీయింగే పనిచేసిందని విమర్శలున్నాయి. మొత్తమ్మీద సీనియర్ మంత్రి జైపాల్ కు కేబినెట్ మార్పుల్లో హోదా మారకపోయినా... కీలకశాఖ పోవడం డిమోషన్ గానే భావిస్తున్నారు.  సమర్థుడైన నేతకు ప్రాధాన్యం లేని శాఖను అప్పగించారన్న విమర్శలు వస్తున్నాయి. 

No comments:

Post a Comment