Sunday 14 October 2012


నందివందనం


పొడుస్తున్న పొద్దును ముద్దాడుతాడు. పొద్దుతిరుగుడు పువ్వుతో పాటాలాడుతాడు. చెల్లెలు పాదంమీద పుట్టుమచ్చై ప్రేమను కురిపిస్తాడు... బిడ్డలను  పొగొట్టుకున్న తల్లులకు తోబుట్టువవుతాడు... అమరవీరుల స్వప్నమవుతాడు.. ఆశయాల జెండాగా రెపరెపలాడుతాడు. అన్యాయానికి వ్యతిరేకంగా పెన్నునే గన్నుగా మలుచుకుని ప్రభుత్వంపై దండెత్తుతాడు. ఆయనే ప్రజాకవి గద్దర్ . జైబోలో తెలంగాణ చిత్రంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దుపైనా నడుస్తున్న కాలమా’ పాటకు నంది అవార్డు లభించింది.
గద్దర్ ఓ యుద్ధనౌక.... సాంస్కృతిక సమరంలో  అలుపెరగని పాటసారి . ప్రజాకళారంగంలో ట్రెండ్ సెట్టర్ . గద్దర్ పాటా, ఆటా, మాటా అన్నీ ప్రత్యేకమే. పాట ఎంత ఫేమసో .. ప్రదర్శనకు   అంతే క్రేజ్ . మహా కవులకు , కళాకారులకు లేని ప్రత్యేకతలు గద్దర్ సొంతం. కవిగా, గాయకుడిగా, కళాకారుడిగా ఆయనకు ఆయనే సాటి. జనం బతుకులను ,బాధలను పాటలుగా మలుస్తారు. సెంటిమెంట్  ... పోరాట పాటలు ఇలా ఆయన రాసిన ప్రతిపాట  విన్నవెంటనే మనను వెంటాడుతుంటాయి. ఆయన గళమెత్తితే జనం వంతపాడతారు. ఆయన ఆడుతుంటే... జనం కూడా స్టెప్పులేస్తారు. తెలాంగాణ ఉద్యమం నేపథ్యంగా ఎన్ శంకర్ తీసిన జైబోలో తెలంగాణ సినిమాలో గద్దర్ రాసి, పాడిన పాటకు 2011 నంది అవార్డు వచ్చింది. 
ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో  కీలకపాత్ర పోషిస్తున్న గద్దర్ కు గతంలో అనేక అవార్డులు వచ్చాయి. ప్రజాకవిగా బసవన్న , సుద్దాల హనుమంతు, శ్రీశ్రీ అవార్డులను అందుకున్నారు . సినిమారంగంలోనూ రచయితగా  తన సత్తా చాటారు గద్దర్. దాసరి డైరెక్షన్ లో నారాయణమూర్తి హీరోగా నటించిన ఓరేయ్ రిక్షా సినిమాలో రాసిన నీ పాదంమీద పుట్టమచ్చనై చెల్లెమ్మా పాటకు నంది అవార్డు వచ్చింది. ఈ పాట పడిన వందేమాతరం శ్రీనివాస్ ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా ఎంపికయ్యారు.  అయితే అప్పట్లో నంది అవార్డును తిరస్కరించారు గద్దర్.
ఈసారి 60 ఏళ్ల వృద్ధాప్యంలో గద్దర్ కు సినీ గాయకుడిగా నందిఅవార్డు రావడం విశేషం. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే ... ఈ పాటను రాసి, పాడటంతో పాటు ... నటించింది కూడా ఆయనే .  హాల్లో ఈ పాటరాగానే ఆడియన్స్ గద్దర్ తో పాటు స్టెప్పులేశారంటే ఆ పాటకు  ఎంత క్రేజ్ ఉందో  అర్థం చేసుకోవచ్చు. గతంలో  మాభూమి సినిమాలోనూ గద్దర్ నటించారు. తెలంగాణ సాయుధ పోరాటం కథాంశంగా రూపొందిన చిత్రంలో బండెనకబండికట్టి పాట పాడారు.   రెండోసారి అవార్డు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసినా... తెలంగాణా రాష్ట్ర ఏర్పడినప్పుడే నిజమైన అవార్డు వచ్చినట్లంటున్నారు గద్దర్ . 2009 డిసెంబర్ 9 ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలంటున్నారు.
సిద్ధంతపరంగా గద్దర్ తో విభేదించే వాళ్లు కూడా  ఆయన పాటలను ఇష్టపడతారు. ఈ  కలం యోధుడి స్ఫూర్తితో  విప్లవోద్యమంతో పాటు ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అనేకమంది పాటల రయితలుగా ఎదిగారు.  ప్రజాఉద్యమ పాటను హత్య చేసేందుకు  గద్దర్ గుండేళ్లో తూటాలు పేల్చినా .... పాట ఆగిపోలేదు. పొడుస్తున్న పొద్దుపొడుపై నిత్యం ఆ గళం గర్జిస్తూనే ఉంది.

No comments:

Post a Comment