Monday 8 October 2012

                         రియల్ హీరో 
 
ఏ దేశంలో చూసినా ఆయన జపమే .... ఏ వస్తువుపై చూసినా ఆయన రూపమే... అలాగని ఆయన దేవుడు కాదు. కానీ,  అంతకన్నా ఫేమస్ . జాతి, మతం , కులంతో సంబంధం లేకుండా  అందరి హృదయాల్లో చోటు సంపాదించాడు.  ప్రపంచవ్యాప్తంగా యూత్ కు ఐకాన్ గా మారాడు. ఆయనే చేగువేరా .... . వీరుడికి మరణం లేదన్న నినాదాన్ని  సత్యమని నిరూపించిన  విప్లవయోధుడు చే. అమెరికా ఖండంలో అగ్నిపూలు పూయించిన  తోటమాలి. నేడు ఆ విప్లవ సేనాని వర్థంతి . 

     చేగువేరా .... పరిచయం అక్కరలేని పేరు. ప్రపంచ పోరాటాలకు ఊపిరూలూదిన విప్లవ యోధుడు. వీరత్వం... ధీరత్వం... త్యాగం... సాహసం... ఇవన్నీ కలిపితే  చేగువేరా. ఈ లక్షణాలే  ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. యూత్ ఐకాన్ గా మార్చాయి. పార్టీలు, ప్రాంతాలు , దేశాలతో   సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి ఆరాధ్యుడిగా చేశాయి. మార్క్సిస్టు సిద్ధాంత కర్తలన్నా ఎక్కువగా పాపలర్ చేశాయి. దక్షిణ అమెరికా ఖండంలో  విప్లవాగ్ని రగిల్చిన సాహసి చే. ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు పెట్టుబడిదారి వ్యవస్థను అంతం చేయాలని కంకణం కట్టుకున్న నిప్పుకణం చేగువేరా. ఆయన  అసలు పేరు ఎర్నెస్టో గువేరా.  అర్జెంటీనాలోని రొసారియా పట్టణంలో 1928 జూన్ 14 న జన్మించాడు. 1953లో  బ్యూనస్ ఎయిర్స్ వర్సిటీ నుంచి డాక్టర్  పట్టాపొందారు. వైద్యుడిగా కుష్ఠురోగులకు సేవలందిచిన  చే... జనం సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సాహస యాత్ర చేశారు . మోటార్ సైకిల్ పై  దక్షిణ అమెరికా ఖండమంతా పర్యటించారు. ఇదే ఆయనతో వినూత్న మార్పు తెచ్చింది. సమాజంలో అసమానతలే ఆయన్ను  విప్లవకారుడిగా మార్చాయి.
      
      ఫెడరల్  కాస్ట్రోతో పరిచయం చేగువేరా జీవితాన్ని కొత్త మలుపుతిప్పింది.  క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని నిర్వహించారు చే. రెడ్ ఆర్మీకి సర్వసైన్య అధ్యక్షుడిగా  శత్రు సైన్యాలపై  దాడులకు దిగారు. తక్కువమందితో వేలాదిమంది సైన్యాన్ని ఎదర్కొన్నారు. డాక్టర్ గా, మిలటరీ కమాండర్ గా, మేధావిగా క్యూబా విప్లవంలో సేవలందించారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో వచ్చాక పరిశ్రమల మంత్రిగా పనిచేశారు చేగువేరా. క్యూబా జాతీయ బ్యాంక్ చైర్మన్ కొనసాగారు. వర్థమాన దేశాల్లో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు పదవిని , హోదాను అన్నింటిని వదిలిపెట్టారు చేగువేరా.  బోలియా మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవపోరాటానికి నాయకత్వం వహించారు. 1967లో వల్లెగ్రాండే ప్రాంతంలో బోలివియా సైన్యం చేతిలో చనిపోయారు చేగువేరా. అగ్రరాజ్యం అమెరికా కుట్రకు బలయ్యారు. క్యూబా మంత్రిగా పనిచేసిన సమయంలో ఐక్యరాజ్య సమితిలో ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. భారత్ పర్యటనలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిశారు.

  విప్లవోద్యమాన్ని అడ్డుకునేందుకు చేగువేరాను హత్య చేయించిన అమెరికా ప్రభుత్వం ... ఇప్పుడు ఆయన్ను మార్కెట్ గా వాడుకుంటోంది. టీ షర్లు, టోపీ, ప్యాంటు , కీ చైన్ , చెప్పులు ఇలా అన్నీ వస్తువులపై చే బొమ్మలు వేసి , అమ్ముకుంటోంది. దీంతో చే  సిద్ధాంతాలు తెలియని వారికి కూడా ఆయనంటే క్రేజ్ గా మారారు. కోట్లాదిమందికి ఆరాధ్యుడయ్యారు.

No comments:

Post a Comment