Friday 2 November 2012

               చిన్నబోయిన సిక్కోలు
 

   సిక్కోలు సింహగర్జన శాశ్వతంగా మూగబోయింది. ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించే ఆ వాగ్ధాటి ఇక ఎప్పటికీ వినిపించదు.పెద్దన్న ఎర్రన్నాయుడు మృతితో శ్రీకాకుళం చిన్నబోయింది.
పాలిటిక్స్ లో ఎర్రన్నది  ఓ డిఫరెంట్ స్టైల్ . మనిషి... మాట అన్నీ ప్రత్యేకమే . బీసీ లీడర్ గా , పార్లమెంటరీ నేతగా సెంట్రల్ లెవల్ లో పాపులర్ అయ్యారాయన. దేశవ్యాప్తంగా టీడీపీ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. న్యాయవాదిగా జీవితాన్ని ఆరంభించిన కింజరపు ఎర్రన్నాయుడు...  రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. న్యాయవాదిగా కోర్టులో ఎలా వాదించేవారో....ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ లోనూ అదే వాగ్ధాటి ఎర్రంనాయుడిది. 1996, 98, 99,2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై.... టీడీపీ పార్లమెంటరీ నేతగా జాతీయ స్థాయిలో ఓ వెలుగువెలిగారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. చూడడానికి భారీగా కనిపించే ఆయనకు కేవలం 55 ఏళ్లే అంటే ఎవరూ నమ్మరు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న నేత ఆకస్మికంగా మరణించడం టీడీపీకి పెద్ద లోటనే చెప్పొచ్చు.
ఎర్రన్నాయుడుపై  గౌతు లచ్చన్న ప్రభావం ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాకు గౌతు లచ్చన్న పేరు పెట్టాలని ఆయన అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరారు. బీసీ నేతగా టీడీపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఎర్రన్నాయుడు ఢిల్లీలో ఉన్నంతవరకు ఆయనే పార్టీ, పార్టీనే ఆయన అన్నంతగా ఉండేది. హస్తిన వర్గాల్లో  ఎర్రన్న పేరు మార్మోగేది. మంత్రుల దగ్గరకు వెళ్లి  రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలు సమర్పించడం ... అఖిలపక్షంతో కలిసి భేటీలు .. జాతీయ విధానాలపై కాంగ్రెస్ ను మీడియా ద్వారా తూర్పారపట్టడం... ధర్నాలు , ఆందోళనతో జాతీయ పార్టీలను నేషనల్ మీడియాను టీడీపీ వైపు ఆకర్షించేలా చేశారు.  ఆయన ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో పార్టీ ఊసులేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. నామా నాగేశ్వర రావు సభలో సమర్థవంతంగానే మాట్లాడుతున్నప్పటికీ ... ఎర్రన్నాయుడి  పోషించిన స్థాయిలో లేదని ఢిల్లీలో టాక్.
1998లో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకునేందుకు టిడిపి సహకరించింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి వర్గంలో చేరటానికి  ఇష్టపడని చంద్రబాబు లోక్ సభ స్పీకర్ పదవి తీసుకోవటానికి ఆసక్తి చూపారు. అప్పుడు ఆ పదవికి ఎర్రన్నాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే చివరి నిమిషంలో అమలాపురం ఎంపి బాలయోగికి ఇవ్వాలని నిర్ణయించారు. దళితనేతకు ఆపదవినిస్తే పార్టీకి బలం పెరుగుతుందని చంద్రబాబు భావించారు. అయితే నామినేషన్ కి సమయం తక్కువగా ఉండటంతో బాలయోగి ఢిల్లీకి చేరుకోవటం కష్టమనుకున్నారు. దాదాపు ఎర్రన్నాయుడే లోక్ సభ స్పీకర్  అవుతారని భావించారు. కానీ ఆఖరు నిమిషంలో బాలయోగి నామినేషన్ వేసి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు.  ఆసమయంలో మరో నేత అయితే అలగడమో.. పార్టీకి దూరమవటమో.. ఏదో ఒకటి చేసేవారు. కానీ ఎర్రనాయుడు హుందాగా వ్యవహరించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించే  ఓ కార్యకర్తగా, అధినేత ఆదేశాలను పాటించే ఓ నేతగా మసలుకున్నారు. ఆ హుందాతనమే ఎర్రన్నాయుడికి పార్టీలోకాక ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చిపెట్టింది. బాలయోగి  ఆకస్మిక మరణానంతరం మళ్లీ తిరిగి  ఎర్రాన్నాయుడు లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. అయితే గుజరాత్ లో మత ఘర్షణలు చెలరేగడంతో  బీజేపీ ప్రభుత్వంలో పదవి తీసుకుంటే పార్టీకి నష్టమని భావించిన చంద్రబాబు లోక్ సభ స్పీకర్ పదవిని వదులుకున్నారు. దీంతో మరోసారి ఆయన లోక్ సభ స్పీకర్ పదవిని అందుకోలేకపోయారు.
కిల్లి కృపారాణి చేతిలో ఓటమి తర్వాత పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు  జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యం తగ్గించి ... శ్రీకాకుళంపైనే దృష్షి పెట్టారు. జిల్లాలో పార్టీకి పునర్వైభం తీసుకొచ్చేందుకు కృషి చేశారు.. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం టీడీపీకి  గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
టీడీపీలో అనేకమంది బీసీ నేతలున్నప్పటికీ ఎర్రన్నాయుడు లేని  లోటు భర్తీ చేయడం కష్టమనే  చెప్పాలి. కష్టకాలంలో అనేకమందినేతలు ఇతర పార్టీలోకి జంప్ అయినా ఆయన  తొణకేలేదు. పరిస్థితులకు భయపడలేదు. ఓటమీ గెలుపులతో సంబంధం లేకుండా పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేశారు. 

No comments:

Post a Comment