Friday 14 December 2012


                 యుగాంతం పుకారేనా?
      డిసెంబర్ 21 ప్రళయం రాబోతుందా? యుగాంతానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందా? సౌరజ్వాలలు భూమిని సర్వనాశనం చేస్తాయా? ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా అందరిని వెంటాడుతున్న భయం. డిసెంబర్ 21న కచ్చితంగా భూమి బద్దలైపోతుందని కొందరు... సూర్యుడి ప్రతాపంతో మాడి మసైపోతుందని మరికొందరు... ఇలా ఎవరి విశ్లేషణలు వారు చేశారు. మరి ఇందులో ఏది నిజం? నిజంగానే డిసెంబర్ 21న భూమికి నూకలు చెల్లనున్నాయా?
భూమ్మీద  ఏ జీవరాశులు కూడా శాశ్వతం కాదు.అలాగే ఈ సృష్టి కూడా ఏదో ఒకరోజు నాశనం కాక తప్పదు అని పురాణ గ్రంథాలు, పూర్వీకులు చెబుతున్నారు.యుగాంతంపై  అనేక సినిమాలు వచ్చాయి. కాలజ్ఞానుల వాదన ప్రకారం డిసెంబర్ 21, 2012తో సృష్టి అంతరించబోతోందట. ప్రముఖ భవిష్యత్ దార్శనికుడు నోష్ట్రడామస్ ఇది నిజమంటున్నారు.మాయన్స్ క్యాలెండరు కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.డిసెంబర్ 21, 2012 డూమ్స్ డే ...  యుగాంతంగా ప్రచారమైంది.

రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయట.గ్రహాల ఆకర్షణ, వికర్షణల ఫలితంగా భూగోళం అల్లకల్లోలంగా మారుతుందట.భూమిపై ఏ  ప్రాణీ బ్రతికే అవకాశం ఉండదట.ఇదేరోజూ "పోలార్ షిప్మెంట్" అంటే  ధ్రువాల మార్పిడి కూడా జరుగుతుందన్నది కొందరి వాదన.ఫలితంగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం గాను, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం గాను మారనున్నాయి. దీనితో పరిశోధకులు ఏకీభవించడం లేదు.

యుగాంతం రావడానికి చాలా కారణాలు చెబుతున్నారు.దక్షిణ అమెరికాలో నివశించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు అని చెప్పగా..  2012 చివర్లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయని  అంచనా వేస్తున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు.ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై సౌర తుఫానులు ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది.అడుగున అగ్ని పర్వతం ఉండడం వల్లే ఇలా జరుగుతోంది. అగ్నిపర్వతం ప్రతి ఆరున్నర లక్షల ఏళ్లకోసారి బద్ధలవుతుంటుంది.దీని వల్ల సూర్యరశ్మి భూమిపై సోకే అవకాశం లేకుండా ఆకాశమంతా బూడిద కమ్ముకుంటుంది. భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. ఇది  2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బైబిల్ తో పాటు ఇతర మత గ్రంథాలు యుగంతాన్ని ప్రస్తావించాయి. పోతులూరి వీరిబ్రహ్మం కూడా  తన కాలజ్ఞానంలో యుగాంతాన్ని వివరించారు.
సుమేరియన్లు గుర్తించిన నిబురు గ్రహం భూమి వైపు దూసుకొస్తోందని తెలిసినప్పటి నుంచీ ప్రళయవార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది భూమిని సమీపిస్తే ఖగోళంలో అనేక మార్పులు సంభవిస్తాయని, గ్రహాల కక్ష్యల్లో మార్పులు చోటు చేసుకొని ఘోర పరిణామాలకు దారితీస్తుందని పుకార్లు షికార్లు చేశాయి.ఆ ప్రళయ కాల దినం 2003 మేలో వస్తుందని ముందుగా అంచనా వేశారు. అది కాస్తా దాటిపోయింది. తర్వాత మాయన్ క్యాలెండర్‌కు 2012కు లింక్ చేస్తూ ప్రళయాన్ని పోస్ట్‌పోన్ చేశారు. మాయన్ క్యాలెండర్‌ డిసెంబర్‌లో ముగుస్తుందనే మెసో-అమెరికన్ల సంప్రదాయ లెక్కే 2012 డిసెంబర్‌ 21 ప్రళయానికి ఆధారం. అయితే అది కూడా తప్పేనని, మాయన్ క్యాలెండర్‌ డిసెంబర్ 21తో ముగియడం లేదని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.  జనవరి 1 నుంచి కొత్త క్యాలెండర్‌ ప్రారంభమైనట్టే... మాయన్ల లాంగ్‌ కౌంట్ పీరియడ్ మొదలవుతుందని చెబుతున్నారు.
మరోవైపు సౌర కుటుంబంలోకి ఒక అపరిచిత గ్రహం చొచ్చుకొచ్చి... నేరుగా భూమినే ఢీ కొంటుందని, దీంతో భూమి బద్దలైపోతుందన్న ప్రచారం జరుగుతోంది.ఇందులో ఎలాంటి నిజం లేదని నాసా విశ్లేషిస్తోంది.ఇలాంటిదేమైనా ఉంటే.. ఇప్పటికే తెలిసిపోయేదని అంటున్నారు సైంటిస్టులు.ఇక సూర్యుడి నుంచి వెలువడే... జ్వాలలు భూమిని భస్మీపటలం చేస్తాయన్నది మరికొందరి వాదన.సౌరజ్వాలలు... సూర్యుడి ఉపరితలంపై ఎప్పుడూ ఉండేవే. వాటి తీవ్రత పెరిగిన సందర్భాల్లో... ఆ ప్రభావం భూమిపైనా స్వల్పంగా ఉంటుంది. ఉపగ్రహాలు, సమాచార వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. కానీ... ఏ రకంగా చూసినా... ఇప్పుడప్పుడే సౌరజ్వాలలు భూమిని మాడి మసి చేసేంతగా వచ్చే అవకాశమే లేదంటోంది నాసా.గ్రహాలన్నీ నిర్దేశిత కక్ష్యల్లోనే పరిభ్రమిస్తాయని ... 4 బిలియన్ సంవత్సరాల వరకూ... భూగోళం నిక్షేపంలా ఉంటుందంటోంది నాసా. 400 కోట్ల ఏళ్లు అంటే మరో 16 కోట్ల తరాల జనరేషన్‌కి ఇంకా ఈ భూమ్మీద అవకాశముందని చెబుతోంది. భూమి వైపు దూసుకొస్తున్న గ్రహం ప్లూటో లాంటి చిన్న గ్రహమని... అది సౌరవ్యవస్థ బయటి భాగంలో ఉన్నందున మనకొచ్చిన ప్రమాదమేమీ లేదంటోంది.యుగాంతం లేదని నాసా భరోసా ఇస్తున్నా..  జనంలో అపోహలు తొలగడం లేదు.
  

No comments:

Post a Comment