Wednesday 1 August 2012


కేంద్రమంత్రి వర్గ మార్పులతో తెలంగాణ అంశం తెరమరుగు కానుందా ? సొంత రాష్ట్రంలో విదర్భ సమస్యను  ఎదుర్కొంటున్న హోం మంత్రి షిండే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడే సాహసం చేస్తారా? షిండే నియామకానికి ప్రత్యక రాష్ట్రం అంశానికి సంబంధం ఉందా? తెలంగాణ వాదులను వేధిస్తున్న ప్రశ్నలివి. 
చిదంబరం మళ్లీ ఆర్థిక శాఖమంత్రిగా  బాధ్యతలు చేపట్టడంతో విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే హోం శాఖకు షిఫ్ట్ అయ్యారు. ఆదర్శ్ కుంభ కోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షిండేకు   కీలకమైన హోంమంత్రి  పదవి కట్టబెట్టడం  విమర్శలకు దారితీసింది. గతంలో మహారాష్ట్ర సీఎంగా సీఎంగా పనిచేశారు షిండే. మన రాష్ట్ర గవర్నర్ గా కూడా కొంత కాలం కొనసాగారు. అయితే  సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ నేత హోం మంత్రి కావడం తెలంగాణ వాదుల్లో ఆందోళన కలిగిస్తోంది.  షిండే వల్ల తెలంగాణ అంశం తెరమరుగవుతుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో  విదర్భ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. తెలంగాణలాగే విదర్భ కూడా వెనకబడిన ప్రాంతం.  బీజేపీ రాష్ట్ర విభజనను సమర్థిస్తుండగా.... శివసేన వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రతిసారి విదర్భలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో విదర్భ అభివృద్ధికి కేంద్ర 15 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ... ఇప్పుడదే రాష్ట్రానికి చెందిన షిండే  హోంమంత్రి కావడం ... తెలంగాణకు ఇబ్బందన్న వాదనలు వినిపిస్తున్నాయి. షిండే విభజనకు అనుకూలమా ? వ్యతిరేకమా ? అన్నవాదనలు పక్కన పెడితే .... తెలంగాణపై ఆయన ఏం మాట్లాడినా దాని ప్రభావం విదర్భలో కూడా ఉంటుందన్నది వాస్తవం.
రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్ర మంత్రిమండలిదే తుది నిర్ణయమైనప్పటికీ ... దాన్ని అమలు చేసే ప్రధాన బాధ్యత హోం శాఖదే. తెలంగాణ ఏర్పాటుపై డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ... మరో ప్రకటన చేసి జనంలో  గందరగోళం సృష్టించారు మాజీ హోంమంత్రి చిదంబరం. తెలంగాణ పరిష్కారం   రాజకీయపార్టీల చేతుల్లోనే ఉందంటూ ... సమస్యను తేల్చకపోగా మరింత చిక్కుముడి వేసి వెళ్లారు.
ఇక షిండే  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై  ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. విదర్భ, తెలంగాణ రెండు వెనకబడిన ప్రాంతాలయినా..... వీటి రాజకీయ నేపథ్యంలో చాలా తేడా ఉంది. అందుకే  తెలంగాణకు అనుకూలంగా షిండే మాట్లాడతారా? చిదంబరం బాటలోనే నడుస్తారా తెలియాల్సి ఉంది. మరోవైపు  తెలంగాణకు చెక్ పట్టే పనిలో భాగంగానే  కేంద్రం షేండేను హోంమంత్రిగా చేసిందన్న ఆరోపణలూ లేకపోలేదు.

No comments:

Post a Comment